ఎక్కడి పార్టీ ఏ స్థితికి వచ్చింది? ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో ఉన్నా తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకోలేక ఆఖరికి సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాల కోసం పాకులాడుతూ ఉండటం తెలుగుదేశం పార్టీ ధీనస్థితికి నిదర్శనంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలు అయిపోయి ఏడాది కావొస్తున్నా ఇప్పటి వరకూ తెలుగు తమ్ముళ్లు పత్తా లేరు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో అయినా, టీడీపీకి కంచుకోటలు అనుకున్న నియోజకవర్గాల్లో అయినా సందడి లేదు. స్వయంగా అధినేత చంద్రబాబు నాయుడే పక్క రాష్ట్రంలో సెటిలయిపోయారు. కరోనా కష్ట కాలంలో కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున చిన్నపాటి సహాయ కార్యక్రమాన్ని కూడా చేపట్టలేకపోవడం గమనార్హం.
వాస్తవానికి ప్రపంచంలోని మానవాళికే కరోనాకు మించిన విపత్తు లేదు. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. కరోనా భయాల నేపథ్యంలో పనులు చేసుకునేందుకు ప్రజలు ఇళ్లు దాటలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వ్యవసాయ పనులు పుష్కలంగా ఉన్నాయి. కూలి పనులు చేసే వాళ్లకు డిమాండ్ ఉంది. రాయలసీమ ప్రాంతంలో భారీ ఎత్తున పంటలు ఆసగయ్యాయి. సకాలంలో కురిసిన వర్షాలతో భారీ ఎత్తున వేరుశనగతో సహా ఇతర పంటలు సాగయ్యాయి. ఇప్పుడు ఆ పంటల్లో కలుపుతీత ఇతర పనులున్నాయి. అయితే కూలీలు మాత్రం దొరకడం లేదు. కూలి పనులు చేసుకునే వాళ్లు కరోనా భయాల నేపథ్యంలో ఆ పనులకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. అలాగని పనులు చేసుకోకపోతే వాళ్లకు ఖర్చులకు కూడా కష్టమే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు రాయలసీమలోని గ్రామాల ప్రజలు. రైతులు కష్టమోనష్టమో వ్యవసాయ పనులను ఆపడం లేదు. కూలి పనులు చేసుకునే వాళ్లకే ఎక్కువ కష్టాలు వచ్చాయిప్పుడు.
మరి ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం తన వంతుగా ఉచిత రేషన్, పెన్షన్ల పెంపు ఇతర సంక్షేమ పథకాలతో వారిని ఆదుకుంటూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా తన వంతుగా ఇలాంటి సమయంలో ఏదైనా చిన్నపాటి సహాయ కార్యక్రమానికి పూనుకుని ఉండొచ్చు. అయితే అలాంటి ప్రయత్నమే లేకపోవడం గమనార్హం. ప్రతిపక్షంలో ఉండటం అంటే.. అధికార పక్షంపై రాళ్లు వేయడమే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నారు. దేశంలోనే భారీ ఎత్తున కరోనా పరీక్షలు చేస్తూ, టెస్టింగ్- ట్రేసింగ్ ద్వారా మాత్రమే కరోనా నివారణ సాధ్యం అవుతుందన్న అంతర్జాతీయ విశ్లేషణలకు అనుగుణంగా జగన్ ప్రభుత్వం పని చేస్తూ ఉంది. అయినా చంద్రబాబు నాయుడు రాళ్లేయడం మాత్రం మానడం లేదు. అందుకు ట్విటర్ ను వేదికగా చేసుకున్నారు.
లోకేష్ ట్విట్టర్ పక్షి అనుకుంటే, చంద్రబాబు నాయుడు కూడా ఆ గూట్లోనే చేరిపోయారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో ఒక కుటుంబానికి నటుడు సోనూసూద్ ట్రాక్టర్ సాయం గురించి చంద్రబాబు నాయుడు స్పందించేసి, ఆ ఆడపిల్లలను దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించడం ఆయన డ్రామాలు పతాకస్థాయికి చేరాయనే అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా చిత్తూరు. అలాంటి చోట ఈ పరిస్థితి ఉందంటే చంద్రబాబు నాయుడే ముందుగా సిగ్గుపడాల్సింది. 14 సంవత్సరాలు సీఎంగా చేసి, సొంత జిల్లాలో అలాంటి పరిస్థితి ఉందంటే.. చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. అయితే అలాంటిదేమీ లేకపోగా.. వైరల్ గా మారిన వ్యవహారంతో తనకూ ప్రచారం వస్తుందని చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినట్టుగా ఉన్నారు.
ఆ ఆడపిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు చదివిస్తుందట! వాళ్లకు కాలేజీ, హాస్టల్ వసతి కల్పిస్తుందట ఎన్టీఆర్ ట్రస్టు. ఇదీ కరోనా కాలంలో చంద్రబాబు నాయుడు వాళ్లకు ఇచ్చిన వరం. బాధ్యతాయుతమైన ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడు ఉద్దరిస్తున్నది ఇది. అది కూడా ఆ అమ్మాయిల వీడియో వైరల్ అయ్యింది కాబట్టి! ఆ వైరల్ వీడియోకు అనుగుణంగా స్పందిస్తే ప్రచారం వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు అలాంటి ప్రకటన చేశారు తప్ప, నిజంగానే వారిని ఆదుకోవాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఉందనుకోవడం కేవలం అపోహ. ప్రచారం వచ్చే పనులకే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతను ఇస్తారనేది ఇప్పటి మాట కాదు. దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు తీరే అంత. ఆఖరికి కరోనా వేళ కూడా ప్రతిపక్ష వాసంలోనూ చంద్రబాబు నాయుడు అవే చీప్ ట్రిక్స్ ప్రయోగించారని ప్రజలు అనుకుంటున్నారు.
లోకేష్, చంద్రబాబుల తీరుతో ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు డ్రామాల పార్టీ అనే నామం సార్థకం అయ్యేలా ఉందని చర్చించుకుంటున్నారు. కరోనా కష్టాల వేళ హెరిటేజ్ పాల ధరను కూడా పెంచి వీలైనంతగా క్యాష్ చేసుకుంటూ.. ప్రభుత్వంపై అకారణమైన రాళ్లను వేస్తూ అదే రాజకీయం అనుకుంటు, సొంత కుల ప్రయోజనాల కోసం ఓపెన్ గా పాటుపడుతున్న చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితం చరమాంకానికి వచ్చిందనే టాక్ కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉంది క్షేత్ర స్థాయిలో!