గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే.. ఆయనొక విచ్చిన్నకారి అన్నట్టుగా వార్తలు ఇచ్చారు. అలాగే మాట్లాడారు. ఏ సందర్భం వచ్చినా వైఎస్ ను ఒక విలన్ గా చూపడానికి అవిశ్రాంతంగా శ్రమించారు. ఒకటని కాదు.. గత పది సంవత్సరాల్లో అంతకు ముందు వైఎస్ పాలన సాగిన ఐదేళ్లలో.. తెలుగుదేశం పార్టీ, దానికి తోడు ఆ రెండు పత్రికలు.. మెజారిటీ మీడియా.. వైఎస్ గురించి నెగిటివ్ వార్తలను తప్ప.. ఒక్కటంటే ఒక్క పాజిటివ్ వార్తను ఇచ్చిన పాపానపోలేదు. బహుశా వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం పాలయిన రెండు మూడు రోజులూ.. ఏవైనా సంతాప వార్తల్లో కొంత పాజిటివిటీ ఇచ్చారో ఏమో!
అయితే ఇప్పుడు తెలుగుదేశం ధోరణి మారుతూ ఉంది. జగన్ ను నెగిటివ్ చేయడానికి.. అప్పుడప్పుడు వైఎస్ ను పాజిటివ్ గా స్మరిస్తూ ఉన్నారు. ఆ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తను వైఎస్ తో ఎంతో సన్నిహితంగా ఉండేవాడిననే రహస్యాన్ని చెప్పారు. ఈ మధ్య కూడా గవర్నర్ కలిసి వచ్చిన అనంతరం మళ్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మరణ చేశారు చంద్రబాబు నాయుడు!
ఇక ఇదే విషయాన్ని పచ్చదళం కూడా అందుకుంది. ఎక్కడ మండలి రద్దు అవుతుందో అనే భయంతో ఉన్న ఈ బ్యాచ్.. మండలి పునరుద్ధరణ జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రసంగాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా హైలెట్ చేస్తూ ఉంది. అదొక చారిత్రక పరిణామం అని అప్పుడు వైఎస్ చేసిన వ్యాఖ్యనే హెడ్డింగ్ చేసింది తెలుగుదేశం మీడియా. ఇప్పుడు జగన్ రద్దు నిర్ణయాన్ని తీసుకోబోతున్నారనే వార్తల నేపథ్యంలో.. ఇలా వైఎస్ ప్రసంగాన్ని చాలా వ్యూహాత్మకంగా, మండలి పునరుద్ధరణ ఒక గొప్ప పరిణామంగా పచ్చదళం వ్యూహాత్మక కథనాలను ఇస్తూ ఉంది.
అప్పుడు వైఎస్ గురించి నెగిటివ్ వార్తలు రాసినది తమ వ్యూహంలో భాగంగానే, ఇప్పుడు వైఎస్ పేరును స్మరిస్తున్నది ఆ వ్యూహంలోనే భాగంగానే. అయితే ఇదే సమయంలో మరో విషయాన్ని ప్రస్తావించాలి. మండలి పునరుద్ధరించినప్పుడు వైఎస్ ప్రసంగాన్ని ప్రచురించారు సరే, మండలి ఏర్పాటు అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారో చెప్పరేం? మండలి వ్యర్థం, వృథా అని అప్పుడు చంద్రబాబు నాయుడు అనలేదా? ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించరు ఎందుకో!