తమ పార్టీ ఆఫీసులపై దాడి జరిగిందంటూ.. దీనికి నిరసనగా రాష్ట్రబంద్ కు పిలుపును ఇచ్చింది టీడీపీ. వాస్తవానికి గత రెండున్నరేళ్లలో టీడీపీ ఇలాంటి పిలుపులు ఏవీ ఇవ్వలేకపోయింది. సాధారణంగా ప్రతిపక్షాలు ఇలాంటి బంద్ పిలుపులను గతంలో ఇచ్చేవి. ఇటీవల కూడా కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీలు బంద్ పిలుపులను ఇచ్చాయి. భారత్ బంద్ కూడా జరిగింది. అప్పుడు కూడా టీడీపీ కిక్కురుమనలేదు!
సాగు చట్టాలకు వ్యతిరేకంగా బంద్ విషయంలో ఏపీ ప్రభుత్వమే మద్దతు ఇచ్చింది. బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అయితే.. టీడీపీ మాత్రం ఆ సమయం కిక్కురుమంటే ఒట్టు! బంద్ కు మద్దతు ప్రకటిస్తూ ఒక ప్రకటన చేస్తే.. ఎక్కడ బీజేపీకి కోపం వస్తుందో అన్నట్టుగా.. టీడీపీ కామ్ గా నిలిచింది. ఇక తాము రగిల్చిన అగ్గికి మరింత ఆజ్యం పోయడానికి బంద్ పిలుపును ఇచ్చింది టీడీపీ.
మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీడీపీకి అంత సీనుందా? రాష్ట్ర బంద్ నిర్వహించేంత స్థాయిలో టీడీపీ క్యాడర్ పనిచేయగలదా? అనేది ప్రశ్నార్థకం. చంద్రబాబు పిలిచాడని.. రోడ్ల మీదకు వచ్చి, ఆర్టీసీ బస్సులను ఆపి, వాటి అద్ధాలను పగలగొట్టి, రచ్చ చేసి, షాపులను మూయించి… రచ్చ చేసేంత సీన్ టీడీపీ క్యాడర్ కు లేదనే అనుకోవాలి.
ప్రజాసమస్యల మీద టీడీపీ బంద్ పిలుపును ఇవ్వలేదు. ప్రతిపక్ష పార్టీలు అన్నీ బంద్ కు పిలుపునిచ్చినప్పుడు అది ప్రజాసమస్యల విషయంలో అయినా టీడీపీ కిక్కురమనలేదు. ఇప్పుడు తన రాజకీయం కోసం ఏకంగా రాష్ట్ర బంద్ అంటోంది. ఎలాగూ ప్రభుత్వం ఈ బంద్ నిర్వహణ జరిగే పని కాదు. రేపు ప్రజలే స్వచ్ఛందంగా బంద్ కు సహకరించారంటూ పచ్చపత్రికల్లో రాసుకోవడం మాత్రం ఈజీనే!