తెలుగుదేశంలో ఉగ్రవాదం ఉందనడంలో తప్పేలేదు. స్వయానా టీడీపీ అధినేత ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వంపై స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే పదం వాడినప్పుడు.. తెలుగుదేశం పార్టీలో కూడా టెర్రరిజం ఉందనక తప్పడం లేదు. అలా చూసుకుంటే, అందరికంటే అతిపెద్ద టెర్రరిజం స్పాన్సర్ చంద్రబాబే అవుతారు.
రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా, చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా విగ్రహాల ధ్వంసాన్ని ఏమనాలి? దీన్ని చంద్రబాబు స్పాన్సర్ చేసిన టెర్రరిజం అనకూడదా..? ఆలయాలపై దాడులు చేసింది ఎవరు..? విగ్రహాలను ద్వంసం చేసింది ఎవరు? రథాలను తగలబెట్టింది ఎవరు? అలాంటి వాటన్నిటికీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూసింది టీడీపీ కాదా..? అనుకూల మీడియాతో, సోషల్ మీడియాతో ప్రజల్ని రెచ్చగొట్టడాన్ని టీడీపీ స్పాన్సర్డ్ టెర్రరిజం అనకూడదా?
అచ్చెన్నాయుడు అరెస్ట్ అయితే బీసీలపై దాడి అన్నారు, కొల్లు రవీంద్రను అరెస్ట్ చేస్తే బీసీలపై జగన్ కి కోపం అన్నారు, ధూళిపాల్ల నరేంద్రను కటకటాల వెనక్కు నెట్టినప్పుడు కూడా సామాజిక వర్గాలను తెరపైకి తెచ్చి కులాల చిచ్చు పెట్టాలని చూశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్నింటికంటే అతిపెద్ద టెర్రరిజం, ఈ కులాల మధ్య చిచ్చు. దీన్ని అనాదిగా ఎగదోస్తోంది చంద్రబాబు కాదా? అప్పుడు దాన్ని టీడీపీ స్పాన్సర్డ్ టెర్రరిజం అనకూడదా?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇన్ని రచ్చలు చేసిన టీడీపీ.. అధికారంలో ఉండగా ఎన్ని ఘోరాలు చేసిందో ఎవరూ మరచిపోలేదు. మహిళా రెవెన్యూ అధికారులపై దాడులు చేసింది, ఇసుక మాఫియాని ప్రోత్సహించింది టీడీపీ నేతలు కాదా..? వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు, వైసీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఎంతోమంది కార్యకర్తల ప్రాణాలు తీశారు. దీన్ని అప్పట్లో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని జగన్ అనలేదే! మరి ఇప్పుడెందుకు బాబు నోటి నుంచి ఇలాంటి మాటలు.
తన మనుషులతో గౌరవ ముఖ్యమంత్రిని ఘోరంగా తిట్టించడం, వైసీపీ నేతల్ని వ్యక్తిగతంగా కించపరచడం.. తిరిగి ఏదైనా ప్రతిచర్య జరిగితే టెర్రరిజం అనడం బాబుకు అలవాటుగా మారిపోయింది. మొన్నటివరకు వైసీపీ నేతల్ని తాలిబన్లు అన్నాడు, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్నే టెర్రరిస్ట్ ప్రభుత్వం అంటున్నాడు. ఇలా వివాదాలు సృష్టించి ఆ మంటల్లో చలికాచుకుంటున్న రాజకీయ స్వార్థపరుడు చంద్రబాబును ఏమనాలి? టెర్రరిస్ట్ కంటే పెద్ద పదం ఏదైనా ఉందేమో!
అసెంబ్లీలో అచ్చెన్నాయుడు అప్పట్లో ఎన్ని ఆగడాలు చేశారో అందరికీ తెలుసు. వైసీపీ నాయకులను అసెంబ్లీకి రానివ్వకుండా వేధించింది, వెలివేసినట్టు ప్రవర్తించింది టీడీపీ కాదా. ప్రజా సమస్యలపై కనీసం చర్చించకుండా నిరంకుశ ధోరణితో అప్పట్లో ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూసించి చంద్రబాబు కాదా. అలాంటి టెర్రరిజం లక్షణాలను మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు పత్తిత్తులైపోయారా..?
టీడీపీ అధికారంలో ఉండగా భౌతిక దాడులు జరిగాయి. అదేమని అడిగితే వైసీపీవారిపైనే కేసులు పెట్టేవారు. నంద్యాలలో టీడీపీ నేతలు చేసిన రౌడీయిజాన్ని ఎవరైనా మరచిపోయారా..? వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డిపై భూమా వర్గీయులు ఏకంగా కత్తులు తీసుకొని వచ్చారు. గన్ మెన్లు చేతిలో తుపాకులు పెట్టుకుని మరీ బెదిరించారు.
ఇక చింతమనేని రౌడీయిజం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2014 ఎన్నిటల్లో టీడీపీకి కొమ్ముకాసిన పవన్ కల్యాణే ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని రౌడీయిజాన్ని ప్రశ్నించారంటే పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు.
ఇలా తన వ్యక్తులతో టెర్రరిజం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రజలచే ఎన్నుకోబడిన ఏపీ ప్రభుత్వాన్ని టెర్రరిజంతో పోల్చడం అతడి విజ్ఞతకే వదిలేయాలి.