వైసీపీ రెబర్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రతిరోజూ నీతి సూక్తులు వల్లిస్తుంటారు. ఆయన చెప్పే నీతులన్నింటిని పుస్తకం వేస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. చెప్పేవాడికి వినేవాళ్లు లోకువ అంటారు. రఘురామకు కూడా లోకం లోకువైనట్టుంది. ప్రభుత్వాలు అలా వుండాలి, ఇలా వుండాలని ఆయన జగన్కు నీతులు చెబుతుంటారు. తన వరకూ వస్తే మాత్రం… అబ్బబ్బే అని జారుకుంటారు.
బీజేపీ మాజీ నేత, ఎంపీ బాబుల్ సుప్రియో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి శభాష్ అనిపించుకున్నారు. పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. లోక్సభకు ఎన్నిక కావడం ఇది రెండోసారి. బీజేపీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న బాబుల్ సుప్రియో నెల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసి, టీఎంసీలో చేరారు.
పార్టీ వద్దనుకున్న తర్వాత, దాని నుంచి వచ్చిన ఎంపీ మాత్రం దేనికంటూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు రాజీనామా లేఖను నేరుగా సమర్పించారు. వైసీపీని ప్రతిరోజూ తూర్పారపడుతున్న రఘురామకృష్ణంరాజు పాటించిన సంప్రదాయం గురించి కాస్త తెలుసుకుంటే మంచిదని నెటిజన్లు కోరుతున్నారు.
తాను కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసి, వైసీపీకి సవాల్ విసిరి నెగ్గితే ప్రజలు హర్షిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సంప్రదాయానికి, నాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరమని రఘురామ అంటే…కాదనే వాళ్లు ఎవరు? ఎందుకంటే ఇప్పుడున్నది అదే స్థితిలో కాబట్టి!