రాజకీయ తెరపై టీడీపీ అధినేత చంద్రబాబుకు మించిన నటులు లేరనే అభిప్రాయం బలంగా ఉంది. ఇందుకు తాజాగా ఆయన చేస్తున్న రాజకీయాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై నోటికొచ్చినట్టు తిట్టారు. హద్దుమీరి తిట్లకు దిగారు. సహజంగానే ఇది వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. ఇరువైపులా ఆవేకావేశాలకు పోవడంతో ఏపీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
అంత వరకూ వెనకుండి కథ నడిపించిన చంద్రబాబు… ఆ తర్వాత తెర ముందుకొచ్చారని ప్రత్యర్థి వైసీపీ ఆరోపిస్తోంది. గత కొన్నేళ్లుగా చంద్రబాబు రాజకీయాలను గమనిస్తున్న వారెవరికైనా ఎప్పుడు, ఎలా వ్యవహరిస్తారో బాగా అర్థమైపోయింది. అందరూ ఊహించినట్టుగా ఘటనల అనంతరం తీరిగ్గా తన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. మీడియా సమావేశం పెట్టారు. ఆగ్రహంతో ఊగిపోయారు.
నటనలో మామకు మించిన అల్లుడిగా చంద్రబాబు నిరూపించుకున్నారని వైసీపీ నేతలు ఘాటైన విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో చంద్రబాబు ఏమన్నారంటే…
‘రాష్ట్రపతి పాలనకు నేను వ్యతిరేకం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతోనే దాడులు జరిగాయి. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారనేందుకు ఇంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఏముంటాయి? 356 అధికరణం ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించాలి’
తన పాలనలో ఏకంగా కేంద్రహోంమంత్రి అమిత్‌షాపై తిరుపతిలో టీడీపీ శ్రేణుల దాడి మాటేంటి? అలాగే తన పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై నడిరోడ్డుపై చెప్పుల దాడిని ప్రజాస్వామిక వాదులు గుర్తు చేస్తున్నారు. దాడులకు, ప్రజాస్వామ్య హననానికి ఆద్యుడైన చంద్రబాబు ఆ పవిత్రమైన అంశం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ప్రత్యర్థులు హితవు చెబుతున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం ద్వారా చంద్రబాబు తాజా కుట్రల వెనక దురుద్దేశం ఏంటో ప్రజానీకానికి తెలిసొచ్చింది.
దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని చంద్రబాబు కోరడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వైసీపీ నేతలు అంటున్నారు. కనీసం తన పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి విచక్షణ మరిచి ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోవడాన్ని ఖండించి ఉంటే ఆ తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడినా మెచ్చుకునే వాళ్లు. కానీ అలా చేయకపోగా, ప్రోత్సహిస్తున్నట్టు బాబు ప్రవర్తించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై గత పదేళ్లుగా పచ్చమూక సాగిస్తున్న మానసిక దాడి మాటేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మానసిక, భౌతిక దాడులు రెండూ సరైనవి కావని ప్రజాస్వామ్య వాదులు అంటున్నారు. వివిధ సందర్భాల్లో ఈ రెండు పార్టీల వైఖరి వల్ల అంతిమంగా ప్రజాస్వామ్యం నమ్మకం పోవడంతో పాటు రాజకీయ వ్యవస్థపై అసహ్యం కలుగుతుందనేది వాస్తవం.