జనసేనాని పవన్‌కల్యాణ్ మరోసారి నవ్వులపాలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెప్పారు. తనకంటూ స్వతంత్ర భావాలు లేవని నిర్భయంగా ప్రకటించుకున్నారు.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నోటి దురుసు ఏపీ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. ఈ రాజకీయ దుష్పరిణామాలకు దారి తీసిన పరిస్థితులను ఖండించాల్సిన పవన్‌కల్యాణ్, అలా చేయకుండా టీడీపీ అధికార ప్రతినిధిగా స్పందించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో టీడీపీ కార్యాలయం, నేతల ఇళ్లపై దాడులు ఎవరికీ క్షేమం కాదని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలుగా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని తెలిపారు. ఇలాంటి దాడులు అరాచకానికి, దౌర్జన్యానికి దారి తీస్తాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి పలు ప్రాంతాలలో దాడి అంటే.. ఉద్దేశపూర్వకంగా చేసిందేనని ఆయన తేల్చి చెప్పారు.
కేంద్ర హోంశాఖ, ఏపీ పోలీసు శాఖలు ఈ దాడులపై ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ అధికార మిత్రుడు, టీడీపీ ఆప్తుడైన పవన్ కల్యాణ్ సూచించారు. వైసీపీ వర్గం వారే ఈ దాడులు చేయించారని చెబుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని పేర్కొన్నారు.
ఇటీవల పోసాని కృష్ణమురళి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుంటే ఇదే పవన్ అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోసాని ఇంటికి వెళుతుంటే దాడి చేసేందుకు వెంట పడ్డారు. పోసాని ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. అప్పుడు మాత్రం పవన్‌కల్యాణ్‌కు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదు.
జనసైనికుల అరాచకం, దౌర్జన్యాల గురించి స్పందించాలని పవన్‌కు అనిపించలేదు. ఎందుకంటే తనపై పోసాని తిట్ల పురాణమే కారణం. తన వరకూ వస్తే గానీ, ఆ నొప్పేంటో తెలియదు. ఇప్పుడు మాత్రం ఆగమేఘాలపై వైసీపీపై విమర్శలు చేయడానికి పవన్ ముందుకు రావడం గమనార్హం.
టీడీపీ నాయకుడు పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చేసిన దూషణల మాటేంటి? ఇవి మానసిక దాడుల కింద రావా? ఇవి ప్రజాస్వామ్యంలో క్షేమకరమా? అసలు ఈ దురదృష్టకర ఘటనలకు కారణమైన వ్యాఖ్యలను ఖండించకుండా, అనంతర పరిణామాలపై పవన్ ఏకపక్షంగా స్పందించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.
జగన్‌ను ఎవరైనా ఏమైనా అనొచ్చు, ఆయన అభిమానులు మాత్రం అన్నీ వింటూ భరిస్తూ ఉండాలని రీతిలో పవన్ ప్రవచనాలు చెప్పడం ఏంటనే నిలదీతలు వ్యక్తమవు తున్నాయి. ఇరువైపు దాడులను ఖండించి ఉంటే పవన్‌కల్యాణ్‌కు గౌరవం ఉండేది. కానీ ఇక్కడ అలా వ్యవహరించకపోవడంతో పవన్ మరోసారి వైసీపీ టార్గెట్ అయ్యారు.