జ‌గ‌న్ స‌ర్కార్‌పై తీవ్ర ఒత్తిడి!

క‌రోనా థ‌ర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో విద్యా సంస్థ‌ల‌ను తెర‌వ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు వివిధ రాష్ట్రాలు సెల‌వుల‌ను పొడిగించ‌డంతో స‌హ‌జంగానే ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. మ‌న పొరుగు రాష్ట్రాలైన…

క‌రోనా థ‌ర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో విద్యా సంస్థ‌ల‌ను తెర‌వ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు వివిధ రాష్ట్రాలు సెల‌వుల‌ను పొడిగించ‌డంతో స‌హ‌జంగానే ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. మ‌న పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో రెండు వారాల పాటు అన్నిస్థాయిల్లోని విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు పొడిగించిన విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు రోజురోజుకూ క‌రోనా కేసులు పెరుగుతుండ‌డం, మ‌రీ ముఖ్యంగా విద్యార్థులు మ‌హ‌మ్మారి బారిన ప‌డుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి లెక్కేలేద‌నే రాజ‌కీయ విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని, విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు పొడిగించాల‌ని కోరుతూ సీఎం జ‌గ‌న్‌కు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఓ లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

రాష్ట్రంలో థర్డ్ వేవ్ ఉధృత‌మవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా ఏఏ రాష్ట్రాల్లో  సెలవులు ప్రకటించారో ఆయ‌న ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఆయ‌న హిత‌వు చెప్పారు.

సంక్రాంతి సెల‌వులు ముగిసి తిరిగి సోమ‌వారం నుంచి ఏపీ వ్యాప్తంగా విద్యా సంస్థ‌లు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే తెలంగాణ‌లో మాత్రం ఈ నెల 30వ తేదీ వ‌ర‌కూ సంక్రాంతి సెల‌వులు పొడిగిస్తూ ఆ రాష్ట్ర విద్యాశాఖ ఆదివారం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఏపీలో కూడా అదే పంథా అనుస‌రించాల‌నే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విద్యా సంస్థ‌ల‌ను మూసివేసే ప్ర‌శ్నే లేద‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్ప‌టికే తేల్చి చెప్పారు.

రానున్న రోజుల్లో సెల‌వుల అంశం రాజ‌కీయ రంగు పులుముకునే అవ‌కాశం లేక‌పోలేదు. ఎందుకంటే గ‌తంలో టెన్త్‌, ఇంట‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌ల‌కు సంబంధించి నారా లోకేశ్ వ్యూహాత్మ‌కంగా పోరాటం చేయ‌డం, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొండి ప‌ట్టుద‌ల‌కు వెళ్లి …చివ‌రికి న్యాయ‌స్థానం జోక్యంతో వెన‌క్కి త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతుందేమోన‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.