పార్టీ గుర్తులేని పంచాయతీ ఎన్నికల్లో.. అన్నీ తామే గెలిచామని ఓటింగ్ శాతం లెక్కలు చెప్పారు! పార్టీ గుర్తుల మీద జరిగిన మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు.
ఇక చేసేది లేక ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలను నామినేషన్ల అనంతరం బహిష్కరించినట్టుగా డ్రామాలాడారు! ఇక నెక్ట్స్ అధికారం తమదే అంటున్న వారు బద్వేల్ బై పోల్ లో అభ్యర్థిని ప్రకటించిన అనంతరం పోటీ నుంచి తప్పుకున్నారు! ఇదీ ప్రతిపక్ష వాసంలో టీడీపీ తీరు.
ప్రత్యక్ష పోటీ, ప్రజాస్వామ్యక పోటీ విషయంలో తెలుగుదేశం చిత్తవుతూ ఉంది. చేతులెత్తేస్తూ ఉంది. అదే అప్రజాస్వామ్యక వ్యవహారాల్లో మాత్రం టీడీపీ ఎంత రాజకీయం అయినా చేయగలుగుతూ ఉంది.
ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు టీడీపీ నేతలకు చాలా చులకన అయ్యాయి! గతంలో కాల్ మనీ సీఎం అన్నందుకు ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి బహిష్కరించారు! ఒక ఎమ్మెల్యేకు అసెంబ్లీకి హాజరయ్యే హక్కును కూడా లేకుండా చేశారు. ఆమెను చిత్రవధ చేశారు.
మరి అప్పుడు ముఖ్యమంత్రి పీఠానికి ఇవ్వాల్సిన విలువల గురించి లెక్చర్లిచ్చిన టీడీపీ నేతలకు, ఇప్పుడు ఆ పీఠం అంత చులకన అయ్యిందా? వారికి జగన్ అంటే ఎంత కసి అయినా ఉండొచ్చు. కానీ ప్రజాలెన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకుని.. పనికిమాలిన మాటలు మాట్లాడటం టీడీపీ నేతలకు అలవాటుగా మారింది.
ప్రతిపక్ష వాసంలో టీడీపీ విధానాలన్నీ ఇలానే ఉన్నాయి. ప్రజాస్వామ్య బద్ధంగా పోటీ చేసో, గెలిచో… ఉనికిని చాటుకోవాల్సిన పార్టీ, తన ఉనికి కోసం, గుర్తింపు కోసం.. బూతులు తిట్టే వాళ్ల మీద, అనుచితంగా మాట్లాడటం, మత రాజకీయం, కుల రాజకీయంల మీద ఆధారపడింది. మరి ఈ రాజకీయంతో.. వచ్చే ఎన్నికల్లో గెలవాలని టీడీపీ అనుకుంటోందా? ప్రజలు ఈ రాజకీయానికి పట్టం గడతారా?