ఒకవైపు టాలీవుడ్ లో చిన్నా చితక నటుల నుంచి స్టార్ హీరోల వరకూ మా రాజకీయ వేడిలో మండుతుంటే ఈ వేడికి చాలా దూరంగా కూల్ గా కనిపిస్తోంది అల్లు ఫ్యామిలీ.
మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ ను గెలిపించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే ప్రచారం నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ కనీసం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు.
అంతకు ముందు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన హాట్ కామెంట్స్ సమయంలో అల్లు అరవింద్ ప్రభుత్వానికి మద్దతుగా స్పందించారు! పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మద్దతు పలకడం అటుంచి, ఏపీ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఆదుకోవాలని బహిరంగ విన్నపాన్ని చేశారు!
ఇదంతా ఒక ఎత్తు అయితే టాలీవుడ్ గ్రూపు రాజకీయాలతో ఊరేగుతున్న వేళ అల్లు ఫ్యామిలీ అందరితోనూ సఖ్యతగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు బాలకృష్ణతో ఆహా లో షో కు సంబంధించిన ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది. ఆ కార్యక్రమంలో తమకు నందమూరి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం గురించి అల్లు అరవింద్ వివరించారు.
బాలకృష్ణ కూడా అల్లు ఫ్యామిలీతో తమకు చాలా అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆ ఈవెంట్ కు చిరంజీవి కూడా హాజరై ఉంటే అదిరిపోయేదేమో!
ఇక అక్కినేని ఫ్యామిలీతో తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. అఖిల్ లాంచింగ్ కు సంబంధించే తను నాగార్జునకు చాలా సలహాలు ఇచ్చానంటూ అల్లు అర్జున్ అంటున్నాడు.
అఖిల్ తొలి సినిమాకు ముందే తనకు చాలా ఇష్టమని.. అతడి లాంచింగ్ గురించి తను చాలా థింక్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ విజయోత్సవంలో అల్లు అర్జున్ ఇలా మాట్లాడాడు.
ఏతావాతా టాలీవుడ్ లో అందరి వారం అనిపించుకోవడానికి చేయదగినంతా చేస్తున్నారు అల్లు ఫ్యామిలీ వారు. దీనికి వారి అందుకు తగ్గ ప్రతి స్పందన కూడా వస్తోంది. ఇదే సమయంలో.. మా ఎన్నికల వేడికి దూరదూరంగా ఉండటం, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు వత్తాసు పలకపోవడం ద్వారా వివాదాలకు దూరంగా ఉండే ఉద్దేశాన్ని కూడా చాటుకుంటోంది. ఇదే బెస్ట్ రూటేమో!