సీఎస్కే ఒక్క షేర్ రేటు 135 రూపాయలు పలికింది. దీని ప్రకారం ఐపీఎల్ టీమ్- చెన్నై సూపర్ కింగ్స్ మార్కెట్ వ్యాల్యూ 4200 కోట్ల రూపాయలు. అయితే త్వరలోనే ఐపీఎల్ లో కొత్త టీమ్ లకు వేలం పాట సాగనుంది. అప్పుడు నూతన జట్ల కనీస ధర ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకూ పలుకుతుందని అంచనా. ఆ లెక్కన ఒక్కో షేర్ ధర రెండు వందల రూపాయలకు చేరే అవకాశాలున్నాయి.
ఒక్క సీఎస్కే షేర్ విలువే కాదు, అన్ని ఐపీఎల్ టీమ్ ల విలువ కూడా భారీ స్థాయికి చేరనుంది. కొత్త టీమ్ ల వేలం పాట.. పాత టీమ్ ల ఓనర్లకు జోష్ ను ఇవ్వనుంది. 2008లో తొలిసారి ఐపీఎల్ నిర్వహణకు ముందు జరిగిన వేలం పాటలో ప్రస్తుత యాజమాన్యాలు అన్నీ, దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల ధరకు ఒక్కో టీమ్ ను కొనుగోలు చేశాయి. అప్పట్లో అత్యల్ప ధర పలికిన జట్టు రాజస్తాన్ రాయల్స్. మిగతా జట్లు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల మధ్య ధర పలికాయి.
తొలి ఏడాది ఐపీఎల్ సూపర్ హిట్ అయ్యింది. అయితే యాజమాన్యాలన్నీ నష్టాలను రికార్డు చేసినట్టుగా అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. కనీసం పది కోట్ల రూపాయల నుంచి, ఇరవై ముప్పై కోట్ల రూపాయలను కూడా ఒక్కో జట్టు నష్టపోయిందని అప్పట్లో కథనాలు వినిపించాయి. అయితే ఐపీఎల్ టీమ్ ల మార్కెట్ విలువ మాత్రం క్రమం తప్పకుండా పెరుగుతూ వచ్చింది.
టీమ్ ఓనర్లకు తిరుగులేని గ్లామర్ దక్కింది. ఐపీఎల్ 14వ సీజన్ ముందు చూసుకుంటే.. అప్పట్లో నాలుగు ఐదు వందల కోట్ల రూపాయలకు వేలం పాడిన వారు ఇప్పుడు ఏడెనిమిది వేల కోట్ల రూపాయల విలువైన బ్రాండ్ల యజమానులు అయ్యారు.
ఐపీఎల్ ప్రాంచైజ్ ఓనర్లు ఏ ఏడాదికాయేడాది బీసీసీఐకి డబ్బులు జమ చేసే పద్ధతి కొనసాగుతున్నట్టుగా ఉంది. ఈ రకంగా చూసుకుంటే.. తొలి సారి జట్లను కొనుగోలు చేసిన వారికి లాభాల పంట పండుతున్నట్టే. వారిలో దురదృష్టవంతులు డెక్కన్ చార్జర్స్ యాజమానులు మాత్రమే. భారీ సాహసం చేసి హైదరాబాద్ జట్టు ఓనర్ షిప్ ను అటు ఇటు గా ఐదు వందల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినా.. ఆ తర్వాతి పరిణామాల్లో, రాజకీయాల్లో వారు ఓనర్షిప్ ను కోల్పోయారు.
ఇప్పుడు సీఎస్కే షేర్ విలువ ప్రకారం చూస్తే త్వరలోనే ఈ ప్రాంచైజ్ దాని మాతృసంస్థ విలువను దాటనుందట! ఇండియా సిమెంట్స్ వాళ్లు సీఎస్కేను అప్పట్లో వేలం పాటలో పొందారు. ఇప్పుడు ఇండియా సిమెంట్స్ మార్కెట్ వ్యాల్యూ ఆరు వేల కోట్ల కు పై స్థాయిలో ఉంది.
త్వరలోనే సీఎస్కే షేర్ కు భారీ ఊపు వచ్చి, దాని విలువ అంచనాలకు తగ్గట్టుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలను దాటితే.. అప్పుడు మాతృసంస్థ ఇండియా సిమెంట్స్ కన్నా.. సీఎస్కే వ్యాల్యూనే భారీగా పెరిగినట్టుగా అవుతుంది.