టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్‌కు చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించారు. బస్సులను అడ్డుకుని అధినేత బంద్ పిలుపును సక్సెస్ చేసేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేసినట్టు వార్తలొస్తున్నాయి. కొన్ని చోట్ల నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయులను అరెస్ట్ చేశారు. అలాగే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నేలపై కూచుని నిరసన తెలిపారు. విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యానారాయణ, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులను వాళ్ల నియోజకవర్గాల్లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కానీ బంద్‌కు పిలుపునిచ్చిన చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ బంద్‌లో పాల్గొన్న దాఖలాలు లేవు. తాము పిలుపు ఇవ్వడమే తప్ప, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై టీడీపీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
ఇలాంటి కార్యక్రమాల్లో అధినేతతో పాటు లోకేశ్, ఇతర ముఖ్యులు పాల్గొంటే కార్యకర్తల్లో భరోసా నింపినవారవుతారని చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను మాత్రం రోడ్లపైకి నెట్టి, తాము మాత్రం టీవీల్లో చూస్తూ గడపడం న్యాయమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.