టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నోటి దురుసు ఏపీలో అనసవర ఉద్రిక్తతలకు దారి తీసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పట్టాభి అవాకులు చెవాకులుపేలడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రభుత్వ చీఫ్ విఫ్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ ఆదేశా లేంటో ఆయన వెల్లడించారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని సీఎం ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో టీడీపీ రాజకీయ ఉనికి కోల్పోయిందని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే అంతా జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిపై కుట్ర ప్రకారమే పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించారన్నారు.
నీచ రాజకీయాలు చేసేదే చంద్రబాబు అని ఆయన విమర్శించారు. పబ్లిసిటీ కోసం ఆయన దేనికైనా తెగిస్తారని ధ్వజమెత్తారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.