టీడీపీ శవరాజకీయాలు ఎంతలేకిగా ఉంటాయో మరోసారి రుజువైంది. ఆమధ్య నెల్లూరు జిల్లాలో అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ భార్య ప్రియుడితో కలసి భర్తను హత్య చేయించింది. చనిపోయిన వ్యక్తి టీడీపీ కార్యకర్త కావడంతో దాన్ని రాజకీయ హత్యగా చిత్రీకరించి ఆమెకు ఆర్థికసాయం కూడా అందించారు స్థానిక నేతలు. చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం బైటపడటంతో షాకయ్యారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి నెల్లూరులో జరిగింది.
గడ్డివాము దగ్గర రాజుకున్న వివాదం, రెండు కుటుంబాల మధ్య గొడవకు దారితీసింది, పాతకక్షలు తోడవడంతో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు గొడ్డలితో నరికి చంపేశారు. ఉదయం హత్య జరిగితే మధ్యాహ్నం వరకు ఎవరూ ఆ సంఘటనను పెద్దగా పట్టించుకోలేదు, సాయంత్రానికి టీడీపీ నేతలు దిగారు. చనిపోయిన వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడంటూ హత్యకు పార్టీ రంగు పులిమారు. వైసీపీ రాజకీయ దాడివల్లే రైతు చనిపోయాడని నానా హంగామా చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ రెచ్చిపోయారు. వైసీపీ దాడిలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య అంటూ కథనాలు వండివార్చారు.
రాత్రికి విషయం చంద్రబాబుకి చేరింది. ఇంకేముంది, బాధిత కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి వారి పిల్లల చదువులకోసం చంద్రబాబు 5లక్షల రూపాయలు ఆర్థికసాయం అందిస్తున్నట్టు ప్రకటనలు వెలువడ్డాయి. పల్నాడు చిచ్చు చల్లారుతుందనుకుంటున్న టైమ్ లో మరో శవరాజకీయానికి సిద్ధమైంది టీడీపీ. కేవలం వైసీపీపై బురదజల్లేందుకే దారినపోయే శవాలన్నిటికీ పచ్చ ట్యాగ్ తగిలిస్తున్నారు టీడీపీ నేతలు.
స్థానిక నాయకులు హడావిడి వారి రాజకీయ దివాళాకోరుతనం అనుకోవచ్చు, కానీ 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రతిపక్ష నేత మరీ ఇంత దిగజారి ప్రవర్తిస్తారని ఎవరూ అనుకోరు. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు పదే పదే ఇలా శవరాజకీయాలు చేస్తుంటే.. ఐదేళ్లలో జనంలో మరింత పలుచన కావడం గ్యారెంటీ.