భూస్థాపితమైన తెలుగుదేశం పార్టీ అంతోఇంతో మళ్లీ పుంజుకోవాలంటే ఎన్టీఆర్ రావాల్సిందేనంటున్నారు సీనియర్ నటుడు గిరిబాబు. ఎన్టీఆర్ ను టీడీపీలోకి రాకుండా అడ్డుకుంటే ప్రజలే ఆ పార్టీని ఇంటికి పంపిస్తారని అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేంతవరకు టీడీపీకి మనుగడ లేదన్నారు.
“ఇంతకుముందే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. మళ్లీ టీడీపీ బతకాలంటే ఒకే ఒక్కడున్నాడు. అతడే జూనియర్ ఎన్టీఆర్. వచ్చే ఐదేళ్లు కాకుండా, ఆ పైన పార్టీని బతికించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడివల్లనే సాధ్యం. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ రానివ్వకపోవడమేంటి? జనం రానిస్తారు. పార్టీలో ఉన్న నాయకుల్ని జనమే ఇంటికి పంపిస్తారు, జూనియర్ ఎన్టీఆర్ ను తెచ్చుకుంటారు. ఈ మార్పు అనివార్యం.”
ఇప్పటికిప్పుడు పార్టీకి ఊపిరి అందించడం చంద్రబాబు వల్ల కాదంటున్నారు గిరిబాబు. పార్టీ భూస్థాపితం అయిపోయిందని, బాబు ఆలోచనలతో అది లేవదన్నారు. మరో పదేళ్లు జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఎన్టీఆర్, వైఎస్ఆర్ తర్వాత ఉత్తమ ముఖ్యమంత్రి జగనే అన్నారు.
“ఐదేళ్లు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. ఆ ఉక్రోషం పట్టలేక వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. వచ్చే టర్మ్ కూడా టీడీపీకి ఛాన్స్ లేదు. మరో 10-15 ఏళ్లు జగనే వస్తారు. తెలుగుదేశం అధికారంలోకి రావడం చాలాకష్టం. టీడీపీతో జనం విసిగిపోయారు. అప్పట్లో ఎన్టీఆర్ పరిపాలన చూశారు. విప్లవం తీసుకొచ్చారు. తర్వాత వైఎస్ఆర్ పాలన చూశారు. జనరంజకంగా పాలించారు. వాళ్లిద్దర్నీ ఇప్పుడు జగన్ లో చూస్తున్నాను.”
తన బ్లడ్ లో తెలుగుదేశం ఉందన్న గిరిబాబు.. ఇప్పుడు మాత్రం తను ఆ పార్టీలో లేనన్నారు. వైఎస్ హయాం నుంచి తన మనసు మారిపోయిందని, ప్రస్తుతం వైసీపీలో ఉన్నానని చెప్పారు. తను జగన్ ను కలవనని, పదవులు ఆశించనని, కేవలం అభిమానిస్తానని అంటున్నారు గిరిబాబు.