అమెరికాలో కరోనా విధ్వంసం సృష్టించడానికి కూడా ఏపీ సీఎం జగనే కారణమా? అని ప్రశ్నిస్తే…ప్రతిపక్ష నేత బాబు విమర్శించే తీరు చూస్తుంటే అలాగే ఉంది మరి. తానేం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో కనీసం చంద్రబాబుకైనా అర్థమవుతోందా?
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం విలేకరుల సమావేశంలో అన్న మాటలు ప్రస్తావించుకుందాం.
‘ప్రస్తుతం మానవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే వైతాళికులు కావాలి. చిల్లర రాజకీయం, చిల్లర ప్రచారం, చిల్లర పేపర్లు కాదు. అల్పులు, గొప్పవాళ్లు ఇలాంటి సందర్భంలోనే బయట పడతారు’
కేసీఆర్ చెప్పిన ప్రకారం చంద్రబాబు ఏ కేటగిరి కిందికి వస్తారు? అల్పులెవరో, గొప్ప వాళ్లెవరో ఇలాంటి సందర్భాల్లోనే బయట పడతారనే కేసీఆర్ చక్కగా చెప్పాడు. లాక్‌డౌన్ ఉండటంతో మీడియా ముందుకొచ్చి మాట్లాడలేక, అలాగని మాట్లాడకుండా ఉండలేక వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ సర్కార్‌పై ఆరోపణలకు దిగాడు. ఆ విమర్శల్లో ఏమైనా పస ఉందా అంటే అదీ లేదు.
కేరళలో ఇప్పటికి పది వేల మందికి పరీక్షలు చేశారని.. మన రాష్ట్రంలో ఎందరికి చేశారో చె ప్పడం లేదని బాబు విమర్శించాడు. అంతేకాదు రెండ్రోజుల నుంచి మెడికల్ బులెటిన్లలో పరీక్షల విషయం చెప్పకుండా దాస్తున్నారని….మూడు రోజుల క్రితం చేసిన ఆరోపణలే మరోసారి రిపీట్ చేశాడు.
గడచిన ఒకవారంలో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఏకంగా వెయ్యి శాతం పెరిగాయని బాబు ఆందోళన వ్యక్తం చేశాడు. ఎంత మందికి వైద్య పరీక్షలు చేశారో చెప్పకపోతే కేసుల సంఖ్య ఏపీలో పెరిగాయని చంద్రబాబు ఎలా చెబుతున్నాడో, కనీసం ఆయనకైనా అర్థమవుతుందా?
‘విపత్తు సమయంలో ప్రభుత్వానికి సహకరించాలని అందరి కంటే ముందు మా పార్టీ ఎమ్మెల్యేలే తమ వేతనం విరాళంగా ఇచ్చారు. మాట్లాడాలంటే చాలా ఉన్నా ఇది సరైన సమ యం కాదని మేం సంయమనం పాటిస్తున్నాం’ అని చంద్రబాబు అన్నాడు. చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ అసలు ఉద్దేశం ఏంటో చివరికి తేలిపోయింది. తనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు తమ వేతనాన్ని విరాళంగా ఇచ్చారని మరోసారి జనానికి గుర్తు చేయడమే బాబు వక్రబుద్ధి. టీడీపీ విరాళం చారెడైతే….ప్రచారం మాత్రం బారెడు అనే సామెత చందానా ఉంది. బాబు అల్ప బుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?