రెండున్నరేళ్లలో వైసీపీ జనరంజక పాలన అందించలేదని, ప్రభుత్వం విఫలమైందనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. అయితే ఎందులో విఫలమైంది, ఎంతమేర విఫలమైంది అనే విషయంలో మాత్రం స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోతోంది ప్రతిపక్షం.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ హవా కొనసాగుతుండే సరికి టీడీపీకి మరీ దిక్కుతోచడంలేదు. విచ్చలవిడిగా విమర్శలు చేస్తూ.. వాటినే వైఫల్యాలుగా చెప్పాలని భావిస్తోంది. ప్రజలని మభ్యపెట్టాలని చూస్తోంది.
మూడు రాజధానుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గడం విఫలమైనట్టా..?
మాడు రాజధానుల బిల్లు బలంగా లేదనే ఉద్దేశంతో, 'పచ్చ' వర్గీయుల వల్ల పదే పదే కోర్టుల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయన్న అనుమానంతో సమగ్ర బిల్లు కోసం వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
ఇది వైఫల్యం ఎంతమాత్రం కాదు. మార్చిలో సమగ్ర బిల్లు తీసుకొస్తామని మంత్రులు ఆల్రడీ చెప్పేశారు కూడా. అయితే రాజధాని విషయంలో ప్రతిపక్షం విమర్శలు చేస్తూ, ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు కలరింగ్ ఇస్తోంది. ఇది విమర్శ మాత్రమే, ప్రభుత్వ వైఫల్యం ఎంతమాత్రం కాదు.
వరదల్లో సెల్ఫీలు, అది కూడా వైఫల్యమేనా..?
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. సహచరులతో కలసి సెల్ఫీ దిగారంటూ ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. విపత్తు నియంత్రణలో విఫలమయ్యారంటూ విమర్శిస్తోంది. వరదల సమయంలో సెల్ఫీ దిగితే అది వైఫల్యమేనా..? దాదాపు పాతికేళ్ల తర్వాత ఆ స్థాయిలో వరదలు వస్తే.. ప్రభుత్వం ముందు జాగ్రత్త వల్ల ప్రాణ నష్టం కనిష్టంగా నమోదైంది.
వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 2వేల రూపాయల తక్షణ సాయం.. ఇతరత్రా ఆర్థిక భరోసా కల్పించింది ప్రభుత్వం. దీనిపై విమర్శలు చేస్తూ.. ప్రభుత్వ వైఫల్యం అంటే ప్రజలు ఎలా నమ్ముతారు.
ఓటీఎస్ వైఫల్యం కాదు.. ప్రతిపక్షం చేస్తున్న విమర్శ మాత్రమే.
వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షం తీవ్రంగా విమర్శిస్తోంది. కేవలం ఖజానా ఖాళీ అవడం వల్లే ఓటీఎస్ ప్రవేశ పెట్టారంటోంది ప్రతిపక్షం. ఆ విధంగా ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు చేస్తోంది. మరి గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు.. ముందుగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయొచ్చు కదా.
వచ్చేసారి తనకు అధికారమిస్తే పైసా కట్టకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామనడం ఎంతవరకు సబబు. ఓటీఎస్ విఫలమా, సఫలమా అనేది ప్రజలు నిర్ణయించాల్సి ఉంది. దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వ వైఫల్యంగా చెప్పడం మాత్రం టీడీపీకే చెల్లింది.
అసలు విషయాలు పక్కనపెట్టి..
ఇప్పుడు మనం చెప్పుకున్నవి కొన్ని మాత్రమే. ఉద్యోగుల జీతాలు, పోలవరం అంశం, గ్రామ సచివాలయాలు.. ఇలా చాలా అంశాల్లో టీడీపీ వైఫల్యం అనే పదం వాడుతోంది. ఆ పార్టీ జనానికి వైఫల్యానికి, విమర్శకు తేడా తెలియడం లేదు. వాస్తవానికి అన్ని పథకాలను సక్రమంగానే అమలు చేస్తున్నప్పటికీ.. ఇసుక పాలసీ, మద్యం పాలసీల్లో మాత్రం వైసీపీ ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి.
ఇసుక రేటుని నేలకు దించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. మద్యాన్ని పూర్తిగా నియంత్రిస్తామని చెబుతున్నా.. అది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పైపెచ్చు రేట్లు పెంచి మద్యనియంత్రణ అనడం సహేతుకం కాదు.
ఈ దశలో ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపాలంటే ఆ దిశగా సద్విమర్శలు చేయాలి. కానీ అసలు పాయింట్ వదిలేసి, కొసరు విమర్శలు చేస్తూ టీడీపీ కాలం గడుపుతోంది. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదాలనుకుంటోంది. చౌకబారు విమర్శలు చేస్తూ, వాటిని ప్రభుత్వ వైఫల్యాలుగా చూపెట్టాలనుకుంటున్న టీడీపీ ఎప్పటికి ఎదుగుతుందో..?