మోడీ అంటే ఎందుకు భయం. ఆయన విధానాలను ఎందుకు నిలదీయరు అంటున్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. నేషనల్ మోనటైజేషన్ పేరిట ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా మోడీ సర్కార్ అమ్మకానికి పెడుతోందని ఆయన మండిపడ్డారు.
విశాఖలో ఈ రోజు జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఏడేళ్ల బీజేపీ ఏలుబడి మీద నిప్పులే చెరిగారు. ఈ దేశం కష్టపడి సంపాదించుకున్న జాతి సంపదను మోడీ సర్కార్ కార్పోరేట్ పెద్దలకు అమ్మకానికి పెడుతోందని ఆరోపించారు.
కాదేదీ అమ్మకానికి అనర్హం అన్న తీరున ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు పరిశ్రమలను విక్రయానికి పెట్టేశారని అన్నారు. ఇవి చాలవన్నట్లుగా రైల్వేస్, ఎయిర్ పోర్టులు, జాతీయ రహదారులు, ప్రభుత్వ భూములను నేషనల్ మోనటైజేషన్ అంటూ ప్రైవేట్ పెద్దలకు అప్పచెప్పడానికి సిద్ధపడిపోతున్నారని రాఘవులు ద్వజమెత్తారు.
ఇంతలా దేశ సంపద మీద దాడి జరుగుతూంటే వామపక్షాలు తప్ప ఇతర జాతీయ ప్రాంతీయ పార్టీలు ఎందుకు నోరెత్తవని రాఘవులు ప్రశ్నించారు. మోడీని ఎదిరించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని ఆయన నిలదీశారు. ఈ దేశంలో కరోనా రెండు దశల తరువాత ఒక్కసారిగా నిరుద్యోగం పెరిగిందని, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిందని ఆయన పేర్కొన్నారు ఏకంగా పది శాతానికి దాటి నిరుద్యోగం రేటు నమోదు అయిన సంగతిని కూడా గుర్తు చేశారు.
పెద్ద పరిశ్రమలతో పాటు ఎన్నో వేల పరిశ్రమలు మూతపడ్డాయని పేదరికం పతాకస్థాయికి చేరిందని, అయినా కేంద్రం నివారణా చర్యలు తీసుకోవడంతో విఫలం అయిందని బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా అంతా ఒక్కటి కావాలని అపుడే ఈ దేశం నిలిచి గెలుస్తుందని రాఘవులు పిలుపు ఇచ్చారు. మొత్తానికి మోడీ మీద మాట్లాడేందుకు విపక్షాలకు భయమని రాఘవులు డిక్లేర్ చేసేశారు అనుకోవాలేమో.