ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రభ రోజురోజుకూ మసకబారుతోంది. టీడీపీ నేతలైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి వరుస అరెస్టుల నేపథ్యంలో …ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న వాదన అత్యంత పేలవంగా ఉంది. మరీ ముఖ్యంగా అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను బీసీ కులం కోణంలో లబ్ధి పొందాలనుకున్న టీడీపీ కుట్ర పూరిత ఆలోచన ఎదురు తన్నింది.
ఎందుకో గాని బాబు విపరీతమైన డిప్రెషన్‌లో ఉన్నారనే అనుమానం. ఆయన మాటలు ఆ అనుమానాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేస్తే…దాన్ని కిడ్నాప్ అని చంద్రబాబు అభివర్ణిం చారు. బాబు వైఖరిని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తూర్పారపట్టారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవశాలి మాట్లా డాల్సిన మాటలు కాదివి అని ఆయన హితవు పలికారు. అలాగే అచ్చెన్నాయుడి అరెస్ట్ బీసీలపై దాడి అని, గాంధీ, జ్యోతిరా వుపూలే, అంబేద్కర్ తదితర మహనీయుల విగ్రహాలకు వినతిపత్రాలను సమర్పించాలని పార్టీ శ్రేణులకు ఆయన హితవు పలికారు. బీసీ కార్డు ప్రయోగం బెడిసి కొట్టింది. రాజకీయాలంటే గౌరవం, మర్యాదున్న నాయకులెవరైనా ఇలా మాట్లాడుతారా?
తాజాగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదివారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలందరూ తమ ఇళ్లలోనే ఉంటూ కాగడా ప్రదర్శన చేపట్టాలని బాబు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని తన నివాసంలో చేపట్టిన కాగడాల ప్రదర్శనలో చంద్రబాబు కాగడా చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఓ ఫ్యాక్షనిస్టు పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చీకట్లు నింపింది చాలదా? ఇప్పుడు ఏ వెలుగుల కోసం ఈ కాగడా ప్రదర్శన. చంద్రబాబు నేలవిడిచి సాము చేస్తున్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి సచ్ఛీలురని ఏపీ ప్రజలెవరూ నమ్మడం లేదు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు. ఈఎస్ఐ కుంభకోణంలో భారీ స్కాం జరిగిందా లేదా? అలాగే వాహనాల కుంభకోణంలో జేసీ బ్రదర్స్ పాత్ర ఉందా? లేదా? అనే విషయాలు తప్ప మిగిలిన అనవసరమైన మాటలు, విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం లేదు.
ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం విజ్ఞులైన రాజకీయ నాయకుల లక్షణం. అలా కాకుండా తమ అభిప్రాయాలను ప్రజాభిప్రాయాలుగా మలచాలనే భావజాలానికి ఎప్పుడో కాలం చెల్లింది. ఒకప్పుడు మీడియాను అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకున్నట్టు…ఇప్పుడు చేయాలంటే కుదరదు. ఎందుకంటే బాబు పుణ్యాన ఎల్లో మీడియా రాతలను విశ్వసించే పరిస్థితి లేదు. మీడియా వ్యవస్థను గొబ్బు పట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.
అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టుల విషయంలో ఎంత అరిసి గీపెట్టినా ప్రజల నుంచి ఎలాంటి పాజిటివ్ స్పందన రాదనే విషయాన్ని ఇప్పటికైనా చంద్రబాబు గ్రహించి అందుకు తగ్గట్టు వ్యవహరిస్తే గౌరవం ఉంటుంది. తప్పునకు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. అదేదో చట్టాలు, పోలీసులు, కోర్టులకు టీడీపీ అతీతమన్నట్టు బాబు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో అసహనం కలిగిస్తోంది. అయినా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనే చందంగా…ఆరిపోయే టీడీపీ కాగడాకు వెలుగు ఎక్కువే.