మంత్రుల హోదాకు వెళ్లినా పల్లెటూళ్లో పంచాయతీ ఎన్నికలను నేతలు వదల్లేరు. సొంతూళ్లో పట్టును కలిగి ఉండటంలో ఉన్న మజా.. ముఖ్యమంత్రి అయినా ఉండదేమో! చాలా మంది నేతల రాజకీయ పయనం గతంలో సర్పంచ్ పదవితోనే మొదలయ్యేది. అలా ఎదిగి వచ్చిన వారు తమ సొంతూరి పంచాయతీ సర్పంచ్ పదవిపై మక్కువ పోగొట్టుకోలేక తమ కుటుంబీకుల్లో ఎవరో ఒకరిని అక్కడ పోటీ చేయిస్తూ ఉంటారు.
ఈ క్రమంలో ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రముఖ నేతల కుటుంబీకులు తలపడ్డారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడ్డ సంగతి తెలిసిందే. ఏకగ్రీవంగా కాకపోయినా ఆమె నెగ్గారు. ఇక టీడీపీ నేత అచ్చెన్నాయుడు సొంతూళ్లో కూడా పంచాయతీ ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఆ విషయంలో స్వయంగా అచ్చెన్నాయుడు రంగంలోకి దిగి అరెస్టయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కాస్తా సొంతూరి పంచాయతీ విషయంలో రంగంలోకి దిగడం ఆ ఎన్నిక ప్రాముఖ్యతను చాటుతోంది.
ఇక టీడీపీకే చెందిన మరో నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి భార్య కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. విశాఖ పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన సత్యనారాయణమూర్తి తన భార్యను తన సొంతూరు వెన్నెలపాలెంలో ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. తుదివిడత పోలింగ్ లో అక్కడ ఎన్నిక జరిగింది. అయితే ఆమెపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు ఏకంగా 464 ఓట్ల మెజారిటీతో నెగ్గడం గమనార్హం.
గతంలో సత్యనారాయణమూర్తి కూడా ఆ ఊరి సర్పంచ్ గానే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారట. రెండు పర్యాయాలు ఆ సర్పంచ్ గా చేశారట. అలాంటి సొంతూల్లో భార్యను పంచాయతీ ఎన్నికల్లో నిలిపి గెలిపించుకోలేకపోయినట్టుగా ఉన్నారు.
విశాఖ ఏరియాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో చాటి చెప్పేందుకు ఈ పంచాయతీ ఎన్నిక కూడా ఒక రుజువు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో సత్యనారాయణమూర్తిపై నెగ్గిన అన్నంరెడ్డి అదీప్ రాజ్ భార్య కూడా వారి సొంతూరులో పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేసి విజయం సాధించడం గమనార్హం.