తుదివిడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి హిందూపురం. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ప్రత్యేకత ఏమిటో చెప్పనక్కర్లేదు. గత ఎన్నికల్లో టీడీపీ ఆ జిల్లాలో నెగ్గిన రెండు నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి బామ్మర్ది కమ్ వియ్యంకుడు, సినీ నటుడు బాలకృష్ణ మంచి మెజారిటీతోనే నెగ్గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బాలకృష్ణకు కలిసి వచ్చి ఆయనను గెలిపించాయి.
ఆ సంగతలా ఉంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీ వచ్చిన ఈ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కళ్లు తేలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హిందూపురం జనాలు తనకూ, తన ఫ్యామిలీకీ రుణపడి తనను గెలిపించాల్సిందే తప్ప.. వారికి టచ్ లో ఉండటానికి బాలకృష్ణ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వరు.
ఆయన పీఏలే అక్కడ రాజ్యం చేస్తూ ఉంటారు. ఆయన భార్యకు వసూళ్ల బ్యాగులు అందుతూ ఉంటాయనే టాక్ ఉంది. ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడిని నందమూరి వసుంధర రూపాయలతో లెక్కగట్టి మరీ పీఏల ద్వారా రాబడుతూ ఉంటారని జనం అనుకుంటూ ఉంటారు. హిందూపురంలో నీటి సమస్య తదితరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో తీరుతుంటాయి తప్ప.. బాలకృష్ణ కు అలాంటి విషయాలను పట్టించుకునేంత ఖాళీ ఉండదు.
ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి అక్కడ గట్టి ఝలక్ తగిలింది. పల్లెల్లో బీసీల్లో టీడీపీ అంటే అంతులేని అభిమానం. అయినా కూడా పల్లె పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపించడం గమనార్హం. అక్కడకూ గట్టి ఇన్ చార్జి లేడు హిందూపురంలో. ఇక్బాల్ ను అక్కడ ఇన్ చార్జిగా పెట్టారు కానీ.. ఆయన స్థానికేతరుడు అనే తేడా కొనసాగుతూ ఉంది. స్థానికంగా ఉండే నవీన్ నిశ్చల్ కు పార్టీ బాధ్యతలు ఇవ్వలేదు. ఈ లొల్లి కొనసాగుతూ ఉప్పటికీ.. పంచాయతీల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ మద్దతుదార్లే పై చేయి సాధించడం విశేషం.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 52 పంచాయతీలకు గానూ.. 47 పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదార్లు విజయం సాధించారు. తెలుగుదేశం కేవలం ఐదు పంచాయతీల్లో మాత్రమే పై చేయి సాధించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పల్లెలపై తెలుగుదేశం పార్టీ పట్టు పూర్తిగా చేజారింది అనేందుకు హిందూపురం కూడా ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిన చోట పంచాయతీల్లో పై చేయి సాధించిందంటే.. అక్కడ టీడీపీ చిత్తయ్యిందంటే దానికి బోలెడన్ని లాజిక్ లు చెప్పవచ్చు. టీడీపీకి కంచుకోటలాంటి నియోజకవర్గం హిందూపురం. పల్లెలూ టౌన్ తేడా లేకుండా అక్కడ టీడీపీ అభిమానగణం ఉంది. వైఎస్సార్సీపీకి మాస్ లీడరేమీ లేడక్కడ.
బాలకృష్ణ అప్పుడప్పుడు వెళ్లి తొడలు కొట్టడం వంటి షోస్ చేస్తూ ఉంటారు. అయినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90 శాతం పంచాయతీల్లో విజయం సాధించి టీడీపీకి ఝలక్ ఇచ్చింది. చూస్తుంటే.. హిందూపురం కూడా టీడీపీ నుంచి జారిపోయేందుకు ఇక కౌంట్ డౌనేనేమో అనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.