అమరావతి ల్యాండ్ మైన్ తో తెలుగుదేశం పార్టీలో కలవరపాటు మొదలైనట్టుగా ఉంది. అసలే స్థానిక ఎన్నికల ఫలితాలతో తగిలిన షాక్ లో ఉన్న టీడీపీకి ఇప్పుడు చంద్రబాబుకు అందిన నోటీసులు శరాఘాతంగా మారాయి. అమరాతి రాజధానే పెద్ద అక్రమాల పుట్ట అనే అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు కేవలం తన, తన కులస్తుల రియలెస్టేట్ ప్రయోజనాల కోసమే అమరావతిని కల్పించారనేది ప్రజల్లో ఉన్న నిశ్చితాభిప్రాయం. అమరావతి పేరుతో ఎంత సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేసినా.. ఆఖరికి గుంటూరు, విజయవాడ ప్రజలు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోలేదని స్థానిక ఎన్నికలతో పూర్తి స్పష్టత రానే వచ్చింది.
అమరావతి అంటే ఇక మిగిలింది చంద్రబాబు నాయుడు అక్రమాల అడ్రస్ మాత్రమే. ఈ క్రమంలో సీఐడీ నోటీసులతో చంద్రబాబు నాయుడు వెంటనే న్యాయనిపుణులతో చర్చలు పెట్టుకున్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. న్యాయనిపుణులతో ఈ అంశాల గురించి చర్చిస్తున్నారట!
అయినా.. ఏ అక్రమాలూ జరగనప్పుడు, సీఐడీ విచారణకు హాజరై తను చెప్పాల్సింది చెప్పి రావొచ్చు తెలుగుదేశం అధినేత. అయితే అర్జెంటుగా న్యాయనిపుణులతో చర్చ.. అంటే తప్పించుకునే మార్గాల నుంచి అన్వేషిస్తున్నట్టా? అసలు విచారణకు హాజరు కాకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు ఎత్తుగడలను రచిస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి.
ఇక తెలుగుదేశం నేతలు, చంద్రబాబు వీర భక్తులు.. వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ ఏపీ విభాగం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు స్పందించారు ఈ వ్యవహారంపై. దీనిపై వర్ల, అచ్చెన్న స్పందించిన తీరును గమనిస్తే.. ఇన్నాళ్లూ ఎందుకు లేట్ చేశారు? అన్నట్టుగా ఉంది!
2015లో జరిగిన ల్యాండ్ పూలింగ్ గురించి ఇప్పుడు నోటీసులు ఇస్తారా? అంటూ వర్ల, అచ్చెన్న ప్రశ్నించారు. వీళ్ల ప్రశ్న తీరును చూస్తుంటే.. ఇన్నాళ్లూ ఎందుకు లేట్ చేశారు? అన్నట్టుగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడును అరెస్టు చేయాల్సింది అన్నట్టుగా ఉంది ఈ తెలుగుదేశం నేతల తీరు!
ఇక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అన్యాయమని వీరు వాదిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల భూములను బెదిరించి తీసుకున్నప్పుడు ఆ కేసులు కాక మరేం పెడతారో తెలుగుదేశం నేతలే చెప్పాలి. చూడబోతే చంద్రబాబు పై ఏ సెక్షన్లు పెట్టాలో, ఏ సెక్షన్లు పెట్టకూడదో.. తెలుగు తమ్ముళ్లే డిసైడ్ చేసేలా ఉన్నారు. మొత్తానికి చంద్రబాబుకు నోటీసులతో తెలుగుదేశంలో కలవరపాటు స్పష్టం అవుతూ ఉంది.