పోల‌వ‌రంపై టీడీపీ నేత‌ల బాధేంటో!

ప్రతిష్టాత్మక పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌డానికి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్విరామ‌కృషి చేస్తూ ఉండ‌గా, ఆ ప‌ని పూర్త‌యితే జ‌గ‌న్ కు వచ్చే ఖ్యాతి త‌మ‌కు రాజ‌కీయంగా తీవ్ర దెబ్బ‌గా మారుతుంద‌నే…

ప్రతిష్టాత్మక పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌డానికి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్విరామ‌కృషి చేస్తూ ఉండ‌గా, ఆ ప‌ని పూర్త‌యితే జ‌గ‌న్ కు వచ్చే ఖ్యాతి త‌మ‌కు రాజ‌కీయంగా తీవ్ర దెబ్బ‌గా మారుతుంద‌నే లెక్క‌ల‌తో తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా పొంత‌న‌లేని కార‌ణాల‌ను చెబుతూ బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నాల‌ను తీవ్రం చేసిన దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. 

ప్రాజెక్టు నిర్మాణం వేగంగానే జ‌రుగుతున్నా..ఇటుక కూడా ప‌డ‌టం లేదంటూ చంద్ర‌బాబుతో స‌హా పచ్చ పార్టీ నాయకులు లేని పోని కామెంట్లను చేస్తూ ప్రజలను అయోమానికి గురి చేస్తున్నారు. ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో.. అంతకంటే ఎక్కువే శ్రమ పడుతున్న జగన్ పై వీరు ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారో అర్థం చేసుకోవ‌డం క‌ష్టం ఏమీ కాదు.

పోలవరం జలాశయంలో ప్రస్తుతం అంచనాల వ్యయం 1,656 కోట్లు పెంచడంపై గగ్గోలు పెడుతున్న తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ‌ పచ్చ మీడియా 2016లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు రూ. 1500 కోట్లు అంచనా వ్యయం పెంచడంపై అప్పుడు, ఇప్పుడు నోరు విప్పడం లేదు. ప్రస్తుతం పెరిగిన పనుల వల్ల అంచనా వ్యయం పెరిగింది. కానీ 2016 లో ప్రాజెక్ట్ (హెడ్ వర్స్క్) అంచనా వ్యయాన్ని 4054 కోట్ల నుంచి 5535 కోట్లకు పెంచారు. అంటే 1481 కోట్ల రూపాయలు పెంచుతూ 2016 సెప్టెంబర్ 8న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

2013లో అప్పటి సంస్థ 4054 కోట్లకు పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2015-16 సవరించిన అంచనాల ప్రకారం అంచనా వ్యయం పెంచాలని అప్పటి నిర్మాణ సంస్థ కోరడంతో ఆ మేరకు చంద్రబాబు ప్రభుత్వం వ్యయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.  కానీ దీనిపై అప్పట్లో టీడీపీ కానీ, ప‌చ్చ మీడియా కానీ నోరు విప్పలేదు. ఇప్పుడు పెంచిన ధరలపైనే గగ్గోలు పెట్టడం వారి ద్వంద్వ‌ నీతికి అద్దం పడుతోంది. అలాగ‌ని ఇది రాష్ట్ర ప‌రిధిలోని అంశం కూడా కాదు! 

పొలవరం ప్రాజెక్టులు ఏదైనా అంశాలను పెంచాలన్నా, సవరించాలన్న కేంద్ర జలసంఘం అనుమతి తప్పని సరి. ప్రాజెక్టు నిర్మాణం మొత్తం కేంద్ర జలసంఘం ఆధీనంలో ప్రత్యేక అథారిటీ పర్యవేక్షణలో జరుగుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలియనిది కాదు. పోలవరం అతిపెద్ద వ‌ర‌ద‌ డిశ్చార్జ్ కలిగిన ప్రాజెక్టు కావడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొత్తం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులే పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా సంభవించిన వరదలకు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుకు పలు చోట్ల దెబ్బతింది. ముఖ్యంగా డయాఫ్రం వాల్, అప్పర్ కాఫర్ డ్యాంలతో పాటు మట్టి కట్టలు కోతకు గురయ్యాయి. వీటిని అప్పటి ప్రభుత్వం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేయడం వల్ల ఆ పనులు దెబ్బతిన్నాయి. 

వీటిని దృష్టిలో పెట్టుకొని 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా జలాశయం తట్టుకుని స్పిల్ వే మీదుగా జలాశయం పోయే విధంగా నిర్మాణ పనుల్లో, డిజైన్లలో తరుచూ కేంద్రం మార్పులు చేస్తోంది. ఈ మార్పుల ఆధారంగా నిర్మాణ పనుల్లో వ్యత్యాసం, ముఖ్యంగా పరిమాణం పెరుగుతోంది.

అయితే నిన్నటి వరకు పోలవరం ప్రాజెక్టులో తట్ట మట్టి తీయలేదు… అంటూ ముసలి కన్నీరు కార్చిన  పచ్చ పార్టీ నేతలు ఇప్పుడు అంచ‌నా వ్య‌యాల గురించి విమ‌ర్శ‌లు చేస్తూ ఉన్నారు! కేంద్ర ప్రభుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రుగుతున్న నిర్ణ‌యాల‌పై కూడా తోచిన ప్రేలాప‌న‌లు టీడీపీ నేత‌ల‌కే సాధ్యం అవుతున్నాయి.