సింపుల్ గా కరోనా పరీక్ష.. మరో తప్పుడు ప్రచారం

సోషల్ మీడియా విస్తరించిన తర్వాత నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఇందులో భాగంగా మరో తప్పుడు ప్రచారం ఊపందుకుంది. ఓ వీడియో ఎంతోమందిని మభ్యపెడుతోంది. ఊపిరి బిగపట్టడం ద్వారా సింపుల్ గా కరోనా…

సోషల్ మీడియా విస్తరించిన తర్వాత నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఇందులో భాగంగా మరో తప్పుడు ప్రచారం ఊపందుకుంది. ఓ వీడియో ఎంతోమందిని మభ్యపెడుతోంది. ఊపిరి బిగపట్టడం ద్వారా సింపుల్ గా కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చనేది ఆ వీడియో సారాంశం.

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

ఊపిరి బిగపట్టడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్, ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవచ్చంటూ ఓ వీడియో సర్కులేట్ అవుతోంది. ఇందులో మూడు దశలు చూపించేలా వీడియో రూపొందించారు. మొదటి దశలో ఊపిరి పీల్చుకోవాలి.  రెండో దశలో ఊపిరిని బిగపట్టి ఉంచాలి. మూడో దశలో ఊపిరిని వదిలేయాలి.

రెండో దశలో నిర్ణీత సమయం వరకు ఊపిరిని బిగపట్టి ఉంచితే ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేస్తున్నట్టే లెక్క అని, అలాంటి వాళ్లకు కరోనా లేదని చెబుతూ ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇదంతా తప్పడు ప్రచారమని కొట్టి పారేస్తున్నారు నిపుణులు.

జనాల్ని తప్పుదారి పట్టించడం కోసమే ఇలాంటి వీడియోలు పుట్టుకొస్తున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. ఎలాంటి లక్షణాల్లేని కరోనా పాజిటివ్ వ్యక్తి కూడా వీడియోలో చూపించిన విధంగా ఊపిరి బిగపట్టి ఉంచగలడని, అలాంటప్పుడు అతడి లంగ్స్ ఆరోగ్యంగా ఉన్నాయని ఎలా చెబుతారంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి వీడియోలు చూసి, ఊపిరి పీల్చుకోవడం ఆపేయడం చేస్తే మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉధృతంగా ఉన్న వేళ.. వాట్సాప్ లో వచ్చే సందేశాల్ని ఫాలో అవ్వకూడదని, వైద్యుడి సలహా మేరకు మాత్రమే ఏదైనా చేయాలని సూచిస్తున్నారు.