మోద కొండమ్మకూ తప్పని ఆవేదన

విశాఖ జిల్లాలో ప్రఖ్యాత గిరిజన దేవత శ్రీ మోదకొండమ్మ అమ్మ వారు. ఆ తల్లి వార్షికోత్సవాలను ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా మే నెలలో నిర్వహిస్తారు.ఏజెన్సీతో పాటుగా మైదాన ప్రాంతాల నుంచి కూడా ప్రజలు…

విశాఖ జిల్లాలో ప్రఖ్యాత గిరిజన దేవత శ్రీ మోదకొండమ్మ అమ్మ వారు. ఆ తల్లి వార్షికోత్సవాలను ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా మే నెలలో నిర్వహిస్తారు.ఏజెన్సీతో పాటుగా మైదాన ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున విశాఖ జిల్లా పాడేరుకు వెళ్లి ఆ తల్లి దీవెనలు అందుకుంటారు. 

మొక్కులు కూడా చెల్లించుకుంటారు. ఏజెన్సీలో పర్యటించే ప్రతీ రాజకీయ నాయకుడూ కూడా మొట్టమొదటగా మోదకొండమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకునే ముందుకు కదులుతారు.

అలా గిరిపుత్రులకే కాకుండా యావత్తు మానవాళికి తన చల్లని చూపులతో దీవెనలు అందించే మోదకొండమ్మకు కూడా కరోనా పీడ తప్పడంలేదు.  ప్రతీ ఏటా అమ్మవారి ఉత్సవాలకు వచ్చే వేలాది మంది భక్త జన సందోహం ఈ ఏడాది కూడా కనిపించదని అంటున్నారు.

కరోనా రెండవ దశ ముమ్మరంగా ఉన్న  వేళ అమ్మ వారి ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లుగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలియచేశారు. ఆ తల్లి జాతర ఈ ఏడాది ఉండదు కాబట్టి భక్తులెవరూ రావద్దు అని కరోనా బారిన పడవద్దు అని ఆమె వినతి చేశారు.

మొత్తానికి చూసుకుంటే వారూ వీరూ కాకుండా ఎవరినీ కరొనా వదిలేట్టు లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా గత రెండేళ్ళుగా అమ్మవారి వార్షిక ఉత్సవాలు జరగకపోవడం పట్ల గిరిపుత్రులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే ఏడాది అయినా మోదకొండమ్మకు మోదం కలిగించేలా పరిస్థితులు ఉంటాయేమో చూడాలి.