'నిండామునిగాకా చలేముంది..' అనే సామెతను ప్రస్తావిస్తున్నారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును గమనిస్తున్న సామాన్యులు. కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లిన ఏపీ ఎస్ఈసీని తెలుగుదేశం నేతలు కొందరు కలిసి ఆయనకు సన్మానం చేయడం, శాలువాలు కప్పడం అనే ప్రక్రియను గమనించిన తర్వాత ఈ కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.
ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న వ్యక్తిని ఒక రాజకీయ పార్టీ బాగా సమర్థించడం, ఆయన కనిపిస్తే సన్మానాలు కూడా చేయడానికి వెనుకాడకపోవడం ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో వేరే చెప్పనక్కర్లేదు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసినా తెలుగుదేశం పార్టీ గట్టిగా సమర్థించింది, ఆయన ఇప్పుడు ఎన్నికలను నిర్వహించాలని అనుకుంటున్నా.. తెలుగుదేశం పార్టీ సత్కారాలు చేస్తోంది. నిమ్మగడ్డ ఏం చేసినా తెలుగుదేశం పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం విశేషం.
వాస్తవానికి నిమ్మగడ్డ చెప్పుకుంటున్నట్టుగా ఎన్నికల నిర్వహణకు ఆయన పిలిచిన అన్ని పార్టీల మద్దతు కూడా లేదు. ఉన్నాయే లేవో తెలియని పార్టీలను కూడా పిలిచి ఎన్నికల గురించి వాటి అభిప్రాయాలను నిమ్మగడ్డ కొంతకాలం కిందట సేకరించారు. ఆ సమావేశాల్లో అన్ని పార్టీలూ ఎన్నికలకు మద్దతు పలికినట్టుగా ఆయన చెప్పుకుంటున్నారు. అయితే అది పూర్తిగా అవాస్తవం.
కాంగ్రెస్, బీజేపీలు కూడా అర్జెంటుగా ఎన్నికలు నిర్వహించేయాల నిమ్మగడ్డ నిర్ణయానికి పూర్తి మద్దతు పలకలేదు. తెలుగుదేశం పార్టీ మాత్రమే నిమ్మగడ్డకు బేషరతు మద్దతు ప్రకటించింది. అయితే నిమ్మగడ్డ మాత్రం తెలుగుదేశం చెబితే చాలనుకుంటున్నట్టుగా ఉన్నారో ఏమో అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
కొంత కాలం కిందట ఒక స్టార్ హోటల్లో చంద్రబాబు అనుకూల రాజకీయ నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం అయ్యారనే వార్తలు కూడా టీవీ చానళ్లలో వచ్చాయి.
ఇప్పుడేమో ఆయన కృష్ణా జిల్లాకు వెళ్లిన విషయం తెలుసుకుని స్థానిక పచ్చచొక్కాలు వెళ్లి ఆయనకు సన్మానం చేశాయనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించి.. తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తెలుగుదేశం పక్షపాత ఆరోపణలను నిమ్మగడ్డ ఏ మాత్రం లెక్క చేయడం లేదని, ఈ సన్మానాలు చేయించుకుంటూ, శాలువాలు కప్పించుకుంటూ.. ఆయన స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నారని సామాన్యులు అనుకుంటున్నారిప్పుడు!