స్రవంతి మూవీస్ అంటే మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్. లేడీస్ టైలర్, మహర్షి, మావిచిగురు, ఎగిరేపావురమా, నువ్వేకావాలి. దగ్గర నుంచి నేను శైలజ వరకు ఇలా జాబితా రాసుకుంటూ పోతే చాలా పెద్దదే వుంటుంది. బోలెడు సినిమాలు, వాటిల్లో చాలా మంచి సినిమాలు వుండడానికి కారణం, నిర్మాత స్రవంతి రవికిషోర్ కు కథలు, సాహిత్యం మీద అభిరుచి వుండడమే ప్రధాన కారణం.
సరైన పరభాషా సినిమాను తీసుకోవడం, దాని కోర్ పాయింట్ ను తీసుకుని, అచ్చ తెలుగు సినిమాలా మార్చేయడం అన్నది ఆయన స్పెషాలిటి. ఆయన చెబితే తప్ప ఆయన తీసిన చాలా సినిమాలు రీమేక్ లు అని తెలియవు. అలాంటి నిర్మాత లేటెస్ట్ సినిమా 'రెడ్'. ఇది కూడా ఓ పరభాషా సినిమా నుంచి కోర్ పాయింట్ తీసుకుని తెలుగు ఆడియన్స్ టేస్ట్ లు అద్దినదే. ఈ సినిమా విడుదల నేపథ్యంలో రవికిషోర్ తో ఇంటర్వ్యూ.
రెడ్ లాంటి థ్రిల్లర్ సబ్జెక్ట్ ను తెలుగుకు అనుగుణంగా రీమేక్ చేయాలి అంటే మీకు ఫ్రీడమ్ వుంటుందా?
మామూలుగా అయితే వుండదు. కానీ నేను సినిమాలు రీమేక్ చేయను. మాతృకలోని పాయింట్ మాత్రమే తీసుకుంటాను. ఆ పాయింట్ చుట్టూ కథ అల్లుకుంటాను.
కానీ ఈ ఇంటర్ నెట్ యుగంలో మాతృకతో పోల్చేయడం, పెదవి విరిచేయడం చాలా సులువు అయిపోయింది కదా.
నిజమే. కానీ అలా చేసేది జస్ట్ 10శాతం మంది. వాళ్ల కోసం నేను సినిమా తీయడం లేదు. నాకు నచ్చిన పాయింట్, దాని చుట్టూ నేను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా అల్లిన కథ. ఆ పదిశాతం మినహాయించి మిగిలిన వారికి రీచ్ అవుతోందా లేదా అన్నదే చూస్తాను.
రెడ్ సినిమా మీద ఇస్మార్ట్ శంకర్ ప్రభావం చాలా వున్నట్లుంది.
చాలా అని కాదు. ఉంది. సినిమాలోని రెండు క్యారెక్టర్లలో ఓ క్యారెక్టర్ రఫ్ గా వుంటుంది. ఆ క్యారెక్టర్ లో మీకు ఇస్మార్ట్ శంకర్ కనిపించే అవకాశం వుంది.
రామ్ హీరోయిజం, ఇమేజ్ వీటన్నింటి మధ్యలో మీరు అనుకున్న పాయింట్ పక్కాగా మిక్స్ అవుతుందా?
నేను, మా యూనిట్ ఆ ఫీట్ బాగానే చేసాం అనుకుంటున్నాను. సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది.
అసలు ఈ సినిమా ఎంచుకోవడానికి అందులో వున్న థ్రిల్లింగ్ సస్పెన్స్ పాయింట్ నా? లేక మరేంటీ మీకు నచ్చింది?
అవేవీ కాదు. సినిమాలో వున్న రెండు మహిళల పాత్రలు. తల్లి పాత్ర, ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్ర. ఈరెండింతో మాంచి భావోద్వేగాలు పండించే అవకాశం వుందనిపించింది.అందుకోసం టేకప్ చేసాను.
అనుకున్నట్లు వచ్చిందా మరి?
మీరు నమ్మండి, రెండు సీన్లలో నేను కంటతడి పెట్టాను.
సాధారణంగా పండగ సినిమాలు అంటే ఫన్, ఫ్యామిలీ లేదూ అంటే మాస్. మరి రెడ్ ఈ మూడింటిలో ఏదైనా కేటగిరీ కిందకు వస్తుందా?
ఫన్ అన్నదానికి నేను సమాధానం చెప్పలేను కానీ, ఫ్యామిలీ టచ్ పూర్తిగా వున్న సినిమా. ఇక రామ్ చేసిన రెండు క్యారెక్టర్లో ఒకటి మాస్ కు పక్కాగా నచ్చే క్యారెక్టర్.
థ్రిల్లర్ సినిమాల్లో పాటలు, ఐటమ్ సాంగ్ లు అవసరమా?
మాతృకలోనూ మూడు పాటలే వున్నాయి. మేమూ మూడు పాటలే ఇస్తున్నాం. మాతృకలో వున్న ఓ పాట తీసేసి దానికి బదులుగా ఐటమ్ సాంగ్ పెట్టాం అంతే.
తిరుమల కిషోర్ ఈ థ్రిల్లర్ ప్రాజెక్టు కు ఎలా సెట్ అని మీరు అనుకున్నారు
మీరు థ్రిల్లర్ లైన్ మాత్రమే చూస్తున్నారు. నేను అందులో వున్న ఎమోషన్లు, ఫ్యామిలీ రిలేషన్లు ఇవన్నీ చూసి తిరుమల కిషోర్ ను ఎంచుకున్నాను. నా ఎంపిక తప్పుకాదని సినిమా పూర్తి అయ్యాక తెలిసింది.
ఓటిటి కి మంచి ఆఫర్లు వచ్చినా, యాభై శాతం ఆక్యుపెన్సీతో అనుకున్న మేరకు లాభాలు రావని తెలిసినా, థియేటర్ కే ఎందుకు వస్తున్నారు?
ఎందుకంటే నా సినిమాను థియేటర్లోనే జనం చూడాలనే పిచ్చి కోరిక వున్నవాడిని కనుక. వంట చేసుకుంటూ మొబైల్ లో చూడడానికో, పని చేసుకంటూ మొబైల్ లో చూడడానికో నా సినిమా కాదు. నా సినిమా ను సినిమాగా థియేటర్ లో చూడాలని కోరుకుంటాను. కేవలం డబ్బుల కోసమే నేను ఎప్పుడూ సినిమాలు తీయలేదు. ఓ ఫ్యాషన్ తో తీస్తున్నాను.
కానీ రామ్ హీరో అయిన తరువాత మీరు మీకు నచ్చినట్లు అన్నిరకాల సినిమాలు తీయడం సాధ్యం కావడం లేదేమో?
అదేమీ లేదు. రామ్ ఏ కథకు అయినా సూటవుతాడు. అందుకే అన్ని రకాల కథలు ఎంచుకునే చేస్తున్నాను.
రెడ్ అనే పేరు ఫ్యామిలీలకు రీచ్ అవుతుందా?
మావి చిగురు, ఎగిరేపావురమా, గిల్లి కజ్జాలు, ఇలాంటి టైటిళ్లతో సినిమాలు ఇప్పుడు తీస్తే జనం చూస్తారంటారా? రెడ్ అనే టైటిల్ లో ఓ ఫోర్స్ వుంది. ఓ పవర్ వుంది. అది సినిమా చూస్తే మీరు కచ్చితంగా కనెక్ట్ అవుతారు.
మీ కాంపౌండ్ నుంచి స్టార్ట్ అయిన త్రివిక్రమ్ తో మీ బ్యానర్ లో సినిమా ఎప్పుడు?
చేయాలనే వుంది. ఎప్పటికైనా అవుతుందనే ఆశా వుంది.
ఆయనతో చేయాలనుకునే సబ్జెక్ట్ వుందా?
నా దగ్గర మాఘమాసం అనే సబ్జెక్ట్ వుంది. అది ఎప్పుడో ఎగిరేపావురమా టైమ్ లోనే అనుకున్నది దసరా కు ప్రారంభమై మాఘమాసంతో ఎండ్ అయ్యే సినిమా. సౌందర్యతో చేద్దాం అనుకున్నాం. కుదరలేదు. త్రివిక్రమ్ డైరక్ట్ చేసినా, తనికెళ్ల భరణి స్క్రిప్ట్ రాస్తాను అన్నా ఆ సబ్జెక్ట్ తెరకెక్కించాలని వుంది.
ఓకె అండీ..విష్ యు ఆల్ ది బెస్ట్
థాంక్యూ
విఎస్ఎన్ మూర్తి