ప్రియుడి ఆత్మహత్యాయత్నానికి ఓ ప్రేమ పుస్తకం దారి తీసింది. ఆ జంట ప్రేమ పుస్తకంలో ఈ విషాదం రాయని పేజీగా మిగిలింది. యువతి ప్రేమ నిరాకరణతో ఆ యువకుడు జీవితంపై విరక్తి చెంది తనువు చాలించాలని ప్రయత్నించాడు. అయితే చావు తప్పి మనిషి బతికాడు. కానీ ఆ ఇద్దరి మధ్య వికసించిన ప్రేమ పుష్పం వాడిపోయింది.
సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలో ప్రియుడి ఆత్మహత్యా యత్నం ఘటన దావానలంలా వ్యాపించింది. సూర్యాపేటకు చెందిన ఇరుగు రామన్ హైదరాబాద్‌లో మల్టీ మీడియా రంగంలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మునగాల మండలానికి చెందిన యువతితో అతనికి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య ప్రేమకు పదేళ్లు.
ఈ నేపథ్యంలో ఆ యువతి సూర్యాపేట జిల్లాలోని ఓ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉద్యోగిగా చేరింది. ఉద్యోగం వచ్చిన తర్వాత తనను నిర్లక్ష్యం చేస్తూ, అసలు పట్టించుకోవడం లేదనే భావన అతన్ని బాధ పెట్టసాగింది. ప్రియురాలి నిరాధరణ అతన్ని అంతకంతకూ తీవ్ర మనస్తాపానికి గురి చేయసాగింది.
ఈ నేపథ్యంలో తమిద్దరి మధ్య ప్రేమ బంధాన్ని రికార్డు చేసేందుకు ఏకంగా ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని తన మిత్రులకు పంచిపెట్టాడు. అలాగే తమిద్దరి మధ్య కాల్ రికార్డింగ్‌లను వెబ్సైట్లో పెట్టాడు. తీసుకొచ్చాడు. ఈ విషయం తెలిసి సదరు ప్రియురాలు తనను అల్లరిపాలు చేసిన ప్రియుడిపై చివ్వేం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న రామన్ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ప్రాణాపాయ స్థిలో ఉన్న ప్రియుడిని సూర్యాపేట పట్టణ పోలీసులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.