అవిశ్వాసం నెగ్గింది…మేయ‌ర్ ప‌ద‌వి పోయింది!

కాకినాడ మేయ‌ర్‌పై అవిశ్వాస తీర్మానం విజ‌య‌వంతంగా నెగ్గింది. కాకినాడ న‌గ‌ర మేయ‌ర్ సుంక‌ర పావ‌నిపై అవిశ్వాస తీర్మాన స‌మావేశం ఇవాళ జ‌రిగింది. మేయ‌ర్‌కు వ్య‌తిరేకంగా 36 ఓట్లు వ‌చ్చాయి. ఆమెకు అనుకూలంగా ఒక్క ఓటు…

కాకినాడ మేయ‌ర్‌పై అవిశ్వాస తీర్మానం విజ‌య‌వంతంగా నెగ్గింది. కాకినాడ న‌గ‌ర మేయ‌ర్ సుంక‌ర పావ‌నిపై అవిశ్వాస తీర్మాన స‌మావేశం ఇవాళ జ‌రిగింది. మేయ‌ర్‌కు వ్య‌తిరేకంగా 36 ఓట్లు వ‌చ్చాయి. ఆమెకు అనుకూలంగా ఒక్క ఓటు కూడా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ అస‌మ్మ‌తి కార్పొరేట‌ర్లు కాకుండా, ఇత‌రులు తట‌స్థంగా ఉండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

2017లో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని 50 డివిజన్లకుగాను 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీ 32,  వైసీపీ 10, బీజేపీ 3 , ఇండిపెండెంట్లు 3 సీట్లు చొప్పున‌ గెలుపొందారు. నాడు టీడీపీ అధికారంలో ఉండ‌డంతో స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీళ్ల‌లో కొంద‌రు మ‌ర‌ణించారు.  రాష్ట్రంలో అధికార మార్పిడి నేప‌థ్యంలో టీడీపీలో అస‌మ్మ‌తి స్వ‌రం వినిపించింది.

మేయర్‌ వ్యవహారశైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు. రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికల సమయంలో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు తమను ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లుగా ప్రకటించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో టీడీపీలో విభేదాలు బ‌జారున ప‌డ్డాయి. టీడీపీ అస‌మ్మతి కార్పొరేట‌ర్ల‌కు కాకినాడ న‌గ‌ర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి స్నేహ హ‌స్తం అందించారు.  

కాకినాడ మేయ‌ర్‌ను ప‌ద‌వి నుంచి దించాల‌నే టీడీపీ అస‌మ్మ‌తి కార్పొరేట‌ర్ల నిర్ణ‌యానికి వైసీపీ తోడైంది. ఈ నేప‌థ్యంలో ఆమెపై అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. ఇవాళ జ‌రిగిన ఎన్నిక‌లో మేయ‌ర్‌కు వ్య‌తిరేకంగా 36 ఓట్లు వచ్చాయి. వాటిలో 21 మంది టీడీపీ కార్పొరేటర్లు విప్‌ను ధిక్క‌రించి మేయర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. మరో 9 మంది టీడీపీ కార్పొరేటర్లు తటస్థంగా ఉండిపోయారు. దీంతో మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకున్నట్లయ్యింది.