'గాలికి గెలిచారు.. గాలికి పోతారు.. పది ఓట్లు అటు ఇటు అయితే.. మొత్తం మారిపోతుంది… జగన్ సైకో, శాడిజం లాంటి పాలన సాగిస్తున్నాడు..' ఇవీ గౌరవ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో తరచూ చెప్పిన మాటలు. వీటికి అదనంగా.. 'ఏం పీకారు, ఏం పీకుతారు?' అనే కొశ్చన్ డైలీ అడుగుతూ వచ్చారు.
కల్లుదుకాణం వద్ద కూడా ఈ మధ్యకాలాల్లో ఇలాంటి మాటలు మాట్లాడటానికి ప్రజలు తటపటాయిస్తారేమో! నిశానీలు, ఇంగిత జ్ఞానం లేని వాళ్లు కూడా ఎప్పుడు పడితే అప్పడు చంద్రబాబులా ఇలా బూతులు మాట్లాడరేమో! 14 యేళ్ల పాటు ఒక రాష్ట్రానికి సీఎంను అంటూ చెప్పుకుంటూ, పదేళ్లకు పైగా ప్రతిపక్షనేతనంటూ డముకు వేసుకుంటూ.. 'పీకారా, పీకుతారా, పీకబోతున్నారా..' అంటూ ప్రశ్నించడం చంద్రబాబుకే చెల్లింది!
అన్నింటికి మించి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు పది ఓట్లో, ఐదు ఓట్లో అటూ ఇటూ అయిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోతుందని తమ పార్టీ వాళ్లకు భరోసా ఇచ్చినట్టుగా ఆయన భజంత్రీ పత్రికల్లోనే వార్తలు వచ్చాయి.
జూమ్ మీటింగుల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఓటింగ్ శాతాల గురించి తన లెక్కలు చెప్పారట. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 శాతం ఓట్లు వచ్చాయని, టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని.. వైఎస్సార్సీపీకి పడ్డ ఓట్ల శాతంలో ఐదారు శాతం ఓట్లు ఇటు మళ్లాయంటే తమ పార్టీ మళ్లీ గెలుస్తుందని చంద్రబాబు నాయుడు తమ వాళ్లకు సోది లెక్క ఒకటి చెప్పారట!
అయితే చంద్రబాబుకు అప్పుడు తెలియనిది ఏమిటంటే.. 2019లో వచ్చిన 40 శాతం ఓట్లు అవేమీ టీడీపీ గంపగుత్త కాదు! టీడీపీకి ఆ 40 శాతం ఓట్లు పడ్డాయంటే.. అవన్నీ హోల్ సేల్ కాదు. టీడీపీకి కులం కొద్దీ, క్యాడర్ కొద్దీ ఉన్న ఓటు బ్యాంకుకు తోడు.. అధికారం చేతిలో ఉండటం వల్ల.. ఇచ్చిన తాయిలాలూ, మళ్లీ గెలుపు అంటూ పచ్చమీడియా ప్రచారం చేయడం.. సరిగ్గా పోలింగ్ కు ముందు రోజుల మహిళల ఖాతాల్లోకి పసుపుకుంకమ డబ్బులు, జగన్ కథ అయిపోయిందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు విపరీతంగా చేసిన ప్రచారం.. 23 మంది ఎమ్మెల్యేలను కొనడం.. వీటన్నింటినీ కలుపుకుంటే.. టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం 40.
అయితే.. ఇప్పుడు టీడీపీకి ఆ అనుకూలతలు ఏమీ లేవు. అధికారంలో ఉంటూ.. ఇచ్చిన తాయిళాల ఛాన్స్ లేదు. మళ్లీ అధికారం దగ్గరలో కనపడటమే లేదు. జగన్ పై పచ్చ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదు. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకోకుండా.. ఐదారు శాతం ఓట్లు అటు ఇటు అయితే చాలంటూ లెక్కలు చెప్పారు. తీరా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఐదారు శాతం ఓట్లు అటు నుంచి రావడం అటుంచితే, ఇటు నుంచి పది శాతం ఓట్లు పోయాయి!
40 శాతం తన స్టాండర్డ్ ఓటు బ్యాంకు అని చంద్రబాబు భ్రమల లెక్కలు వేసుకోగా, అంత సీన్ లేదని.. అది 30 మాత్రమే అని ప్రజలు క్లారిటీ ఇచ్చారు. అది కూడా పట్టణాల్లోనే తెలుగుదేశం పరిస్థితి ఇది! అదే పల్లెల ఓట్లను కూడా కలిపితే.. మొత్తం ఓట్లలో టీడీపీ వాటా ఏ 25కు లోపలకో పడిపోయే అవకాశాలు ఉన్నాయి.
పట్టణాల మీద టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంటేనే.. వచ్చింది 30 శాతం ఓట్లు. మొత్తంగా చూసుకుంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 లో వచ్చిన 50 శాతం ఓట్లను అరవై శాతం స్థాయికి పెంచుకుంటే, టీడీపీ అప్పుడు 40 నుంచి ఇప్పుడు పట్టణాల్లో 30 శాతానికి, పల్లెల్లో ఏ 25 శాతానికో దించేసుకుంది. మరి ఐదారు శాతం ఓట్లు అటు ఇటు కావడం అంటూ లెక్కలు చెప్పిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఏమంటారో!