‘కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బాబు రావాలి’,‘రా బాబూ రా..! కాంగ్రెస్ పిలుస్తోంది కదలి రా..!’,‘కాంగ్రెస్‌లో విలీనమా…బీజేపీ, వైసీపీ చేతిలో చావడమా? సమయం లేదు చంద్రబాబు’….తాజాగా సోషల్ మీడియాలో ఆలాంటి నినాదాలు బాగా వైరల్ అవుతున్నాయి. అదేంటోగానీ, కాంగ్రెస్‌లో అధ్యక్ష స్థానం ఎన్నిక లేదా ఎంపిక విషయమై సంక్షోభం తలెత్తితే, చంద్రబాబుపై సెటైర్లు పేలుతున్నాయి.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నిక మరో ఆరునెలలు వాయిదా పడిన విషయం తెలిసిందే. నూతన అధ్యక్షున్ని ఎన్నుకునేంత వరకూ సోనియాగాంధీనే కొనసాగాలంటూ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఓ తీర్మానం ప్రవేశపెట్టడం, దాన్ని సీడబ్ల్యూసీ ఏక గ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే.
అయితే మొగుడు దొరక్కపోతే అక్క మొగుడే దిక్కనే సామెత చందాన జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు అధ్యక్షులెవరూ దొరక్కపోతే చంద్రబాబే దిక్కు అనే ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌ను సమర్థవంతంగా ముందుకు నడిపే రథసారథి కరువైన నేపథ్యంలో, మరోవైపు నమ్మకాన్ని కోల్పోయి ఏకాకిగా మిగిలి, దారితెన్నూ తెలియక ఆకాశం వైపు దిక్కులు చూస్తున్న చంద్రబాబు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి , ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే బాగుంటుందని నెటిజన్లు పెద్ద ఎత్తున ఉచిత సలహా లిస్తున్నారు.
కరోనా సమయంలో హైదరాబాద్‌లో ఇంటి నుంచి అబ్బాకొడుకులైన చంద్రబాబు, లోకేశ్ బయటికి రావడం లేదు. జూమ్ వీడియోలకే పరిమితమై పార్టీ భవిష్యత్‌పై దిగాలు పడుతున్న తండ్రీకొడుకులా ఎలా మాట్లాడుకుంటూ ఉంటారో సరదాగా చెప్పుకుందాం. తన కుమారుడు, భావి ఆంధ్రప్రదేశ్ ఆశా కిరణమైన లోకేశ్‌ను చంద్రబాబు దగ్గరికి పిలుచుకున్నాడు.
‘ఏం నాయనా, మహా అయితే నేను ఆరోగ్యంగా ఉంటే మరో ఐదేళ్లు యాక్టీవ్‌గా ఉండగలను. ఇక ఆ తర్వాతైనా పార్టీ భారాన్ని నువ్వు మోయాల్సిందే. మన ముందు ఇప్పుడు రెండే దారులున్నాయి. కాంగ్రెస్‌కు నాయకత్వలేమి. టీడీపీకి నమ్మక లేమి. ఇటు బీజేపీ, అటు ప్రజలూ మనల్ని నమ్మి ఆదరించే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఇప్పుడేంటి చేయడం’ అని లోకేశ్‌ను చంద్రబాబు ప్రశ్నించారు.
‘నాన్నా మీలాగే నేను కూడా సీరియస్‌గా ఆలోచిస్తున్నాను. ఇక మీ మాయలకు కాలం చెల్లింది నాన్నా. ప్రజలు తెలివిమీరి పోయారు. అధికారం పోయినప్పటి నుంచి ప్రధాని మోడీ ప్రేమ కోసం ఎంత తపిస్తున్నారో నేను దగ్గరుండి గమనిస్తున్నాను. మోడీ కోసం మీరెంత విరహవేదన అనుభవిస్తున్నారో…యువకుడినైన నాకు బాగా తెలుసు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. మనం ప్రేమించే వారికంటే…మనల్ని ప్రేమించే వారి దగ్గరికే వెళ్లడం ఉత్తమం. అందువల్లే కాంగ్రెస్‌తో కలిసిపోవడం తప్ప మరో మార్గం లేదనేది నా భావన’ అని లోకేశ్ సలహా ఇచ్చారు.
‘పుత్రా లోకేశా…నువ్వు నాకెంతగానో నచ్చావు. అధికారమే నాకు సర్వస్వం. అది లేని జీవితాన్ని ఊహించుకోవడం సాధ్యం కావడం లేదు. నువ్వు లేకపోయినా, కుటుంబ సభ్యులెవరూ కనిపించకపోయినా నేను తట్టుకుని ఉండగలను. కానీ అధికారానికి బానిసైన నా పరిస్థితి ఏంటి? మహాభారతంలో మహారాజు దృతరాష్ట్రుని మంత్రి విధురుని వలే గొప్పగా సెలవిచ్చావు కుమార. అవును నువ్వు చెప్పింది నిజమే. ఇందిరాగాంధీ కుటుంబంతో నా సంబంధ బాంధవ్యాలు ఈనాటివి కావు. ఇప్పుడు కాంగ్రెస్‌లో వృద్ధ నేతలైన ఆజాద్, కపిల్ సిబల్, అహ్మద్‌పటేల్, ఏకే ఆంటోని…ఇలాంటి వాళ్లతో నాకెప్పటి నుంచో ప్రత్యేక అనుబంధం ఉంది. కాంగ్రెస్‌కు ప్రేమ ‘హస్తం’ చాచడమే సరైంది. భార్యను, తల్లిని ప్రేమించడం చేతగాని ఆ మోడీకి, నా విరహ వేదన ఏమర్థమవుతుంది’ అన్నారు చంద్రబాబు.
‘కన్నా లక్ష్మినారాయణ అంకుల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకూ రాజకీయ అవసరాల కోసమైనా మనతో కలిసి వస్తారనే నమ్మకం ఉన్నది. ఇప్పుడు ఆ సోము వీర్రాజు బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత…ఆ ఆశలు అడియాసలయ్యాయి. అదేంటో గానీ, మీరు బీజేపీకి కన్ను గీటుతుంటే వాళ్లకు మరోలా అనిపిస్తోంది. ఛీఛీ అలాంటి పాడు బతుకు వద్దు నాన్నా. అందుకే కాంగ్రెస్‌లో టీడీపీ విలీనం చేసి, పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం వస్తే…అంతకంటే కావాల్సిందేముంది నాన్నా. కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. కాంగ్రెస్ పిలుస్తోంది…కదిలి పోదాం ఢిల్లీకి’ అన్నారు లోకేశ్.
‘పళ్లు ఊడగొట్టుకోడానికి ఏ రాయి అయితేనేం. ఎటూ మనల్ని మోడీ, అమిత్‌షా పొరపాటునో, గ్రహపాటునో కూడా దగ్గరికి రానివ్వరు. అస్సలు మన నీడను కూడా వాళ్లు భరించేలా లేరు. అలాంటప్పుడు ఒంటరిగా ఎలాగూ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేనప్పుడు ఆ కాంగ్రెస్ గంగలో దూకితే అన్నీ సరిపోతాయి. నా సమర్థత తెలిసిన, నా మాయలు, మంత్రాలను నమ్ముతున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే…అది ఒక్క కాంగ్రెసే. కావున సమయం లేదు పుత్రా…కాంగ్రెస్‌లో విలీనమే శరణ్యం. మన శ్రేణుల్ని కదలి రమ్మని పిలుపునివ్వు’ అని లోకేశ్‌ను ఆజ్ఞాపించాడు చంద్రబాబు…..
ఆరు నెలల తర్వాత. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుడి వైపు చంద్రబాబు కూచున్నారు. ఎడమ వైపు రాహుల్, ప్రియాంక ఉన్నారు. పార్టీ ముఖ్యనేతలతో పాటు లోకేశ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ తన ముందున్న లేఖను చేతిలోకి తీసుకున్నారు. సమావేశ మందిరంలో గంభీర వాతావరణం. నూతన అధ్యక్ష ఎన్నికకు సంబంధించి కీలక ప్రకటన.
సోనియాగాంధీ గొంతు సవరించుకున్నారు. చదవడం స్టార్ట్ చేశారు.
‘140 ఏళ్ల అనుభవం ఉన్న కాంగ్రెస్. ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీ. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన అతిపెద్ద పార్టీ. ఈ వేళ అధికారం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీది కూడా. అందువల్ల రాష్ట్ర, జాతీయ ప్రయోజనాల రీత్యా తన పార్టీని కాంగ్రెస్‌లో చంద్రబాబు విలీనం చేశారు. అలాగే ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మన 140 ఏళ్ల పార్టీని ముందుకు నడిపే రథసారథి బాధ్యతలను అప్పగిస్తూ తీర్మానం చేస్తున్నాం’ అని సోనియా ప్రకటించారు.
సోనియా చదవడం ముగించగానే కరతాళ ధ్వనులతో సమావేశ మందిరం మార్మోగింది. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు. ఓ పండగ వాతావరణం. కాంగ్రెస్ వృద్ధ నాయకులంతా పూల బొకేలకు బదులు బొంగరాలు, సైకిల్ చక్రాలు చంద్ర బాబుకు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇకపై జాతీయస్థాయిలో మరోసారి చంద్రబాబు బొంగరాలు, సైకిల్ చక్రాలు తిప్పి…మోడీ, అమిత్‌షాలను ఇంటికి పంపనున్నారన్న మాట.