తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి ఎలాగైనా జాతీయ నాయకుడ్ని అనిపించుకోవాలనే తపన ఉంది. అందుకే తనని తాను జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకుని, రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా అధ్యక్షుల్ని నియమిస్తుంటారు. అయితే ఆయన్ని అంతా జాతి నాయకుడిగానే చూస్తారు తప్ప జాతీయ నాయకుడిగా కాదు.
ఈ అపవాదు తొలగించుకోడానికి అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ఎన్నికల్లో తలదూర్చేందుకు ప్రయత్నిస్తుంటారు బాబు. ఎన్నిసార్లు తలబొప్పికట్టేట్టు కేసీఆర్ మొట్టికాయలు వేసినా సరే ఆయనకు ఆ ఆశ తీరలేదు, తీరదు కూడా.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ చేస్తున్న హడావిడి చూస్తుంటే బాబుకి మరోసారి కేసీఆర్ చేతిలో మూడినట్టేననుకోవాలి. రాష్ట్రం విడిపోయినా.. టీడీపీ, వైసీపీకి తెలంగాణలో ఓటుబ్యాంక్ బలంగానే ఉంది.
అయితే ఏపీపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన జగన్.. తెలంగాణ రాజకీయాల్లో తల కాదు కదా, కనీసం వేలు కూడా పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. ఆశబోతు చంద్రబాబు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా తగుదునమ్మా అంటూ తెలంగాణ ఎన్నికల్లో కాళ్లూ చేతులూ పెట్టి విరగ్గొట్టుకుంటుంటారు.
పొరపాటున టీడీపీ తరపున ఎవరు గెలిచినా.. ఆ తర్వాత వెంటనే అధికార పార్టీలోకి ఫిరాయించడం అనేది తెలంగాణలో కామన్ గా జరుగుతున్నదే. అయినా కూడా చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తూనే ఉంటారు.
వాస్తవానికి హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్రావారందరికీ సొంత రాష్ట్రంపై మమకారం ఉండనే ఉంటుంది. ఆ సింపతీతోనే చంద్రబాబు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.
టీటీడీపీ పేరుతో హడావిడి చేస్తున్నారు. తెలంగాణ టీడీపీ నాయకులతో వరుస సమీక్షలు, సమావేశాలు పెడుతూ.. పొత్తుల కోసం ఎత్తులు వేస్తున్నారు చంద్రబాబు.
తమ పార్టీ గెలవలేకపోయినా.. కనీసం టీఆర్ఎస్ ఓట్లు చీల్చాలనేది బాబు దురాలోచన. అలాగైనా కేసీఆర్ పై కక్షతీర్చుకోవాలనేది బాబు ప్లాన్. అయితే కేసీఆర్ గతంలోనే చంద్రబాబుని ఓటుకి నోటు కేసులో ఇరికించి హైదరాబాద్ నుంచి తరిమేశారు. స్టేలతో కాలం గడిపే బాబు.. ఇప్పుడు మరోసారి జీహెచ్ఎంసీ ఎన్నికల పేరుతో కేసీఆర్ ని కెలుకుతున్నారు.
అయితే ప్రస్తుతానికి కేసీఆర్ చేయగలిగింది కూడా ఏం లేదు. ఎందుకంటే బాబు ఆల్రడీ పాతాళంలోనే ఉన్నారు. కేసీఆర్ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు.. ఇంకా ఎన్నికల పేరుతో హడావిడి చేస్తే పాత కేసులు తిరగదోడి బాబుని మరోసారి భయపెడతారనేది మాత్రం వాస్తవం.