ఎద్దు ఈనిందా దూడను కట్టేయండంటున్న టీడీపీ

ఎద్దు ఈనింది అంటే దూడను గాట్లో కట్టేయండి అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు సోమవారాన్ని పోలవరం చేశామంటూ ప్రచారార్భాటంతో ఊదరగొట్టిన టీడీపీ తమ చేతకానితనం ఎక్కడ…

ఎద్దు ఈనింది అంటే దూడను గాట్లో కట్టేయండి అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు సోమవారాన్ని పోలవరం చేశామంటూ ప్రచారార్భాటంతో ఊదరగొట్టిన టీడీపీ తమ చేతకానితనం ఎక్కడ బైట పడుతుందోనన్న ఉద్ధేశ్యంతో అనవసరపు ఆరోపణలతో ప్రతిపక్షంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అభాసు పాలవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ తీరుపై విమర్శలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత తాము రివర్స్ టెండరింగ్కు వెళతామని ఎపుడో ప్రకటించింది. అందులో భాగంగా ఆ ప్రక్రియను చేపట్టింది. తొలుత పోలవరం ప్రాజెక్టులోని ప్యాకేజ్ 65కు రివర్స్ టెండరింగ్ నిర్వహించింది.

టీడీపీ హయాంలో ఎక్కువ ధరకు కోట్ చేసి పనులు దక్కించుకున్న సంస్థ ఇపుడు తక్కువ ధరకు కోట్ చేసి అదే పనిని దక్కించుకుంది. ఆ వెంటనే తాను గతంలో పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నపుడు కనిపెట్టిన క్విడ్ ప్రోకో(నీకిది… నాకది)ను తెరపైకి తెచ్చి ప్రభుత్వంపైన గతంలో తాను అధికారంలో ఉన్నపడు విలేకరుల సమావేశాలు, బహిరంగ సభల్లో, సమీక్షా సమావేశాల్లో పొగిడిన సంస్థను ఇపుడు విమర్శిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. ఏదో జరిగిందని ప్రజల్లో భ్రమ కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్)కు ప్రభుత్వం కట్టబెట్టబోతోందని,ఆ సంస్థ రూ. 500 కోట్ల తక్కువకు బిడ్ దాఖలు చేసిందని, అసలు  బిడ్లు తెరవక ముందే తానే ఒక తీర్పు ఇచ్చేసి ఇదే వాస్తవం అందరూ నమ్మండి అని విష ప్రచారానికి తెరలేపింది.

పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులు, హైడల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. ఆ ప్రక్రియ జరుగుతోంది. శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇది రివర్స్ టెండర్ కాదు, రిజర్వ్ టెండర్ అని కామెంట్ చేశారు. శనివారం ఆ పార్టీ నేత కేఈ కృష్ణమూర్తి ఓ ప్రకటన విడుదల చేస్తూ మేఘా కృష్ణారెడ్డి రూ.500 కోట్ల తక్కువకు ఈ పనులకు టెండర్ దాఖలు చేశారు. ఆయన గ్రూపుకు చెందిన ఓలెక్ట్రా గ్రీన్టెక్ నుంచి రానున్న ఐదు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ రూ. 3380 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయబోతోంది కాబట్టే ఇలా చేస్తున్నారనేది ఆ ప్రకటన సారాంశం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు పనులు ఇంకా ఎవరికీ  కట్టబెట్టలేదు, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియ అస్సలు ప్రారంభం కాలేదు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే గత ఏడాది మార్చిలో వెలగపూడిలోని తాత్కాలిక సచివాయంలో ఇదే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ బస్సును అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పరీక్షించారు. సచివాలయం లోపల విక్టరీ సింబల్ చూపుకుంటూ ఉత్సాహంగా ఒక రౌండ్ వేశారు. ఆ తరువాత తాము గ్రీన్ అమరావతిని రాజధానిగా నిర్మించబోతున్నామని, కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ఎంతో ఉందని అంటూ పలుమార్పులు, చేర్పులు సూచించారు కూడా.

కాలుష్య నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్`2(ఫాస్టర్ ఎడాప్షన్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్) ప్రకటించింది. అందులో భాగంగా దేశవ్యాపితంగా 7090 ఎలక్ట్రిక్ బస్సులను వివిధ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల ద్వారా ప్రవేశ పెట్టేందుకు రూ.3545 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఇతర వాహనాలకు ప్రకటించిన మొత్తం కలిపితే ఇది రూ.10 వేలకోట్లు అవుతుంది. ఆర్సీ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేలా ప్రోత్సహించేందుకు ప్రతి కిలోవాట్కు రూ.20 వేలు, రవాణా సంస్థల నిర్వహణ వ్యయాల ఆధారంగా మరికొంత రాయితీని కేంద్రం ప్రకటించింది. ప్రతి రాష్ట్రం విద్యుత్ వాహనాల కొనుగోలుకు  టెండర్లను పిలుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో ఐతే చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఈప్రక్రియ ప్రారంభం అయ్యింది.  ఆ ప్రక్రియను కొత్త ప్రభుత్వం కొనసాగిస్తోంది తప్ప మేఘా కృష్ణారెడ్డికి అదనంగా చేకూరుస్తున్న లబ్ధి ఇందులో ఏమీలేదు. టెండర్ ప్రక్రియలో ఎవరు తక్కువ ధరకు కోట్ చేస్తే ఆ కంపెనీకే బస్సులు సరఫరా చేసే కాంట్రాక్టు దక్కుతుంది. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు అండ్ గ్యాంగ్ కువిమర్శలకు తెరలేపింది.

అంత ఎలా అవుతుంది…
ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న మార్కెట్ నిపుణులు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 20వేల కోట్లకు చేరుతుందని టీడీపీ వర్గాలు చేస్తున్న ప్రచారం, విమర్శలను ఆ పార్టీ నేతలే అంగీకరించటం లేదు. మా అధినేత చుట్టూ ఉన్న షేర్ మార్కెట్ నిపుణులు, చార్టెడ్ అకౌంటెంట్లకు ఈ విషయం తెలియదని, వారు ఆయనకు చెప్పి ఉండరని కాదు కానీ… ఏదో విమర్శలు చేయాలి కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ నేతలు చేసే విమర్శల ప్రకారం ఒలెక్ట్రా కంపెనీలో మేఘా కృష్ణారెడ్డికి ఉన్న వాటా విలువ వెయ్యి కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు చేరుతుంది.

శుక్రవారం షేర్ మార్కెట్ ముగిసిన తరువాత ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 1528.35 కోట్లు. నేషనల్ స్టాక్ ఎక్సేంజిలో షేరుధర రూ. 192.05 . ఇందులో మేఘా హోల్డింగ్స్ వాటా 44.47 శాతం అంటే వాటా విలువ  679.66 కోట్లు.  చంద్రబాబు అండ్ కో చెప్పినట్లుగా ఒలెక్ట్రా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 20 వేల కోట్లకు చేరుకోవాలంటే  ఒక్కో షేర్ ధర కనీసం రూ. 2520 కావాలి.  27 ఏళ్ల క్రితం స్థాపించి 25 సంవత్సరాల క్రితం పబ్లిక్  ఇష్యూకు వచ్చిన చంద్రబాబు కుటుంబ సంస్థ  హెరిటేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇంకా రూ.1754.54 కోట్లు మాత్రమే.

అధికారంలో ఉన్నపుడు అన్ని ప్రభుత్వ కార్యాయాలు, కార్యక్రమాల్లో హెరిటేజ్ మజ్జిగ ప్రభుత్వ ఖర్చుతో  అమ్మినా ఆయన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగలేదు. 27 సంవత్సరాల క్రితం స్థాపించిన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1700కోట్లకు పైగా ఉంటే ఒలెక్ట్రా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అమాంతం ఒకేసారి ఎలా పెరుగుతుందని టీడీపీ అధినేతతో పాటు నేతలు ఎలా భావించి నిరాధార ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారో పెరుమాళ్లకే ఎరుక. ప్రపంచంలోనే అత్యంత మన్నికైన బీవైడీ కంపెనీ బ్యాటరీలను ఒలెక్ట్రా గ్రీన్టెక్ బస్సుల్లో వినియోగిస్తున్నారు.

ఈ కంపెనీలో రెండు శాతానికంటే తక్కువ పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ శాంసంగ్ 450 బిలియన్ డాలర్లు వెచ్చించింది.  ప్రపంచంలోనే అపర కుబేరుడుగా పేరు గాంచిన వారెన్ బఫెట్ వాటా కలిగి ఉన్న బీవైడీ కంపెనీ  మన దేశంలో ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉంది.  ఒలెక్ట్రా కంపెనీ పేరు మారక ముందు గోల్డ్స్టోన్ ఇన్ఫ్రా టెక్గా ఉండేది. అపుడే బీవైడీతో ఒప్పందం చేసుకొంది. ఇది తాజాగా జరిగిన ఒప్పందం కూడా కాదు.

ఒలెక్ట్రా గ్రీన్ టెక్ బస్సులో తొలుత విహరించింది టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారే. ఆ తరువాత తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్ రోడ్పై ట్రయల్ రన్ నిర్వహించారు. అది విజయవంతమైంది. ఈ బస్సులే హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలి నుంచి రోహతాంగ్ పాస్ వరకూ అతి ప్రమాదకరమైన ఘాట్రోడ్లో ప్రయాణించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కాయి కూడా. కేరళలోని పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్ప స్వాములను తరలించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఒలెక్ట్రా ఎక్ట్రిక్ బస్సులు పొరుగు రాష్ట్రాలైన తెంగాణ, మహారాష్ట్ర, కర్నాటకల్లోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు వినియోగిస్తున్నాయి.

ముంబైలో బస్ సర్వీసు నిర్వహించే బెస్ట్ సంస్థ తాజాగా ఒలెక్ట్రా సర్వీసును ప్రవేశపెట్టింది. పూణే, హైదరాబాద్లో ఇవి సిటీ సర్వీసుగా నడుస్తున్నాయి. ఫేమ్ 2 కింద కేంద్రం ఇచ్చే రాయితీలను ఉపయోగించుకుని ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలు సంసిద్ధం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా అదేబాటలో పయనించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. నిర్ధేశించిన ప్రమాణాలు, ఉత్పత్తి సామర్ధ్యం, సాంకేతిక అంశాలు అన్నీ సరిపోతేనే ఏ  సంస్థ నుంచి అయినా ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేస్తుందనేది చంద్రబాబుతో పాటు ఆయన అనుచరగణానికి తెలియనిది కాదు.

పోలవరం ప్రాజెక్టును ఏటీఎం మాదిరిగా టీడీపీ నేతలు వాడుకున్నారని సాక్షాత్తూ దేశ ప్రధాని ఆరోపించారు. ఆ ఏటీఎం తమ వారి చేతుల్లోంచి జారిపోతే తమ లావాదేవీలు ఎక్కడ బైట పడుతాయో అన్నఒకే ఒక దుగ్థతో చంద్రబాబు బోడిగుండుకు మోకాలికి ముడి వేయాలని చూస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇందులో దాచాల్సింది ఏమీలేదు.

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు