మాజీ మంత్రి, టీడీపీ కర్నూలు జిల్లా నేత భూమా అఖిలప్రియను టీడీపీ అధిష్టానం పట్టించుకోలేదా? అంటే …ఔననే సమాధానం వస్తోంది. ఇటీవల కాలంలో గోడమీద పిల్లిలా అఖిలప్రియ వ్యవహార శైలి ఉండడంతో పార్టీ దూరం పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. అయితే రాయలసీమలో జరుగుతున్న ఉప ఎన్నికలో అదే ప్రాంతంలోని కర్నూల్‌కు చెందిన భూమా అఖిలప్రియ ఊసే లేకుండా పోయింది.
ఇదే భూమా అఖిలప్రియ అన్న, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ అధిష్టానం గుర్తించి నెల్లూరు జిల్లా గూడూరు బాధ్యతలను అప్పగించింది. అక్కడ మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డితో కలిసి బ్రహ్మానందరెడ్డి ఊరూరూ తిరుగుతూ టీడీపీ గెలుపు కోసం పని చేస్తున్నారు. కానీ అఖిలప్రియను పార్టీ పరిగణలోకి తీసుకోకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
హైదరాబాద్‌లో కిడ్నాప్ కేసులో జైలుపాలైన అఖిలప్రియ ప్రచారానికి వస్తే జనంలోకి నెగెటివ్ సంకేతాలు వెళుతాయని టీడీపీ అధిష్టానం భయపడిందని చెబుతున్నారు. మరోవైపు ఆమె అధికార వైసీపీతో ఇటీవల కాలంలో స్నేహంగా మెలగడం, ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసన్న కోసం తహతహలాడుతున్నారనే ప్రచారం కూడా అఖిలప్రియపై చంద్రబాబుకు నమ్మకం పోయేలా చేసిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
వైసీపీ నుంచి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే అటు వైపు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న నేతను ప్రచారానికి తెచ్చుకుని ఏం చేయాలనే ప్రశ్నలు టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తిరుపతి అభ్యర్థిగా ఒక మహిళను నిలిపిన పరిస్థితుల్లో, ఆమెకు తోడుగా పార్టీలోని మహిళా నేతలను పంపాలని ఆలోచించినప్పటికీ అఖిలప్రియను పరిగణలోకి తీసుకోవడానికి చంద్రబాబు అనాసక్తి చూపారనే ప్రచారం జరుగుతోంది. దీంతో భూమా కుటుంబంలో ఒక్క బ్రహ్మానందరెడ్డినే తమ నాయకుడిగా చంద్రబాబు గుర్తించారంటున్నారు.
అందువల్లే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అఖిలప్రియపై అధిష్టానానికి సానుకూల అభిప్రాయం ఉంటే …తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఎందుకు భాగస్వామ్యం కల్పించలేదనే ప్రశ్నకు ఆమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.