చంద్రబాబు భార్య కాదు.. ఎన్టీఆర్ కూతురు

మహానుభావుడు ఎన్టీఆర్ పేరుని అవసరానికి వాడుకోవడం, ఆ తర్వాత తీసి పక్కనపెట్టడం చంద్రబాబుకు అలవాటే. దశాబ్దాలుగా బాబు ఫాలో అవుతున్న పద్ధతి ఇదే. ఇప్పుడు మరోసారి చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తొచ్చారు.  Advertisement తన భార్యను…

మహానుభావుడు ఎన్టీఆర్ పేరుని అవసరానికి వాడుకోవడం, ఆ తర్వాత తీసి పక్కనపెట్టడం చంద్రబాబుకు అలవాటే. దశాబ్దాలుగా బాబు ఫాలో అవుతున్న పద్ధతి ఇదే. ఇప్పుడు మరోసారి చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తొచ్చారు. 

తన భార్యను అనరాని మాటలు అన్నారంటూ లేనిపోనివి సృష్టించి, మీడియా ముందు దొంగ ఏడుపు ఏడ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరును మరోసారి విచ్చలవిడిగా వాడేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా మొత్తం భువనేశ్వరిని చంద్రబాబు భార్యగా సంబోధించడం లేదు. ఎన్టీఆర్ కూతురుగానే భావిస్తోంది. అలా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.

ఇక్కడెవరో నన్ను పూలచొక్కా అన్నారు, అర్జంట్ గా లెక్చరర్ నాకు సారీ చెప్పాలి అన్నట్టుంది చంద్రబాబు పరిస్థితి. ఇక్కడెవరో నా భార్యను ఎగతాళి చేశారు, నందమూరి ఫ్యామిలీ అర్జంట్ గా మీడియా ముందుకు రావాలి అంటూ గోల చేసిన చంద్రబాబు అనుకున్నది సాధించారు. 

భువనేశ్వరి నందమూరి వారింటి ఆడబిడ్డే.. కాదనలేం కానీ ఇప్పుడామె నారావారి కోడలు. నారా భువనేశ్వరి. తన భార్యని అంతమాటన్నారు, ఇంతమాటన్నారు అని ఆపసోపాలు పడ్డ చంద్రబాబు.. ఆమె వ్యవహారంలో కూడా పుట్టింటిని, అందులోనూ ఎన్టీఆర్ ఫ్యామిలీని వాడుకోవాలనుకోవడమే ఇక్కడ కొసమెరుపు..

గతంలో జూనియర్ ఎన్టీఆర్ ని ఇలాగే ఫ్యామిలీ పేరు చెప్పుకుని వాడుకుని వదిలేశారు. ఆ తర్వాత హరికృష్ణ కుమార్తెను తెలంగాణ ఎన్నికల్లో బలి చేశారు. ఇలా పదే పదే ఎన్టీఆర్ ఫ్యామిలీని వాడుకోవడం, ప్రతిఫలం మాత్రం కేవలం నారా వారి ఫ్యామిలీకే దక్కేలా చూసుకోవడం చంద్రబాబుకి అలవాటే. ఆ క్రమంలో ఇది మరో ఘట్టం అంతే..

తెలుగువాడి ఆత్మగౌరవం ఇప్పుడెందుకు..?

చంద్రబాబు పర్సనల్ గొడవకీ, తెలుగువాడి ఆత్మగౌరవానికీ సంబంధం ఏంటి..? అయినదానికీ, కానిదానికీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేస్తుంటారు చంద్రబాబు. 

తనకి అవసరం ఉంటే బీజేపీతో జతకడతారు, అవసరం తీరాక తెగతెంపులు చేసుకుని తెలుగువారి ఆత్మగౌరవాన్ని వారికి రుచి చూపించాలని రంకెలేస్తారు. తనకి అవసరం ఉంటే కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటారు, అవసరం తీరాక ఆత్మగౌరవం అంటారు.

ప్రజల సమస్యలు తనవి కావు, కానీ తన సమస్య మాత్రం ప్రజలందరికీ అనే స్వభావం చంద్రబాబుది. గతంలో కూడా తాను అధికారం కోల్పోతే.. ప్రజలకేదో కష్టం వచ్చినట్టు కవర్ చేసుకోవాలని చూశారు. ఇప్పుడు కూడా తన భార్యను ఎవరో ఏదో అన్నారని, దీనికి తెలుగు ప్రజలంతా ఏకం కావాలంటూ 'ఆత్మగౌరవం' నినాదం ఇవ్వడం చంద్రబాబుకే చెల్లింది.

ఈ ఏడుపు ఎందాక..?

మొత్తమ్మీద తన ఏడుపుతో ఎన్టీఆర్ కుటుంబంలో కాస్తంత కదలిక సాధించగలిగారు చంద్రబాబు. అయితే దాని వల్ల అంతిమ ప్రయోజనం ఉండదనేది బాబుకి కూడా తెలుసు. 

ఎన్టీఆర్ కుటుంబం అంతా ఏకమైనా, వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ టీడీపీకి ఎన్టీఆర్ ఫ్యామిలీకి దూరం పెరిగిపోతుందనుకుంటున్న క్రమంలో ఈ చిన్న లాజిక్ తో చంద్రబాబు అందర్నీ తన దగ్గరకు చేర్చారు.