టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ మాదిగ ముఖ్య నేతలు వర్ల రామయ్య, జవహర్ ఎసరు పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం ఆ పార్టీ వర్గాల నుంచి వస్తోంది.
టీడీపీ శ్రేణుల అనుమానాలను నిజం చేస్తూ టీడీపీ మాదిగ నేతలు వర్ల రామయ్య, జవహర్, ఎంఎస్ రాజు తదితర నేతలు ఆదివారం విజయవాడలో రహస్య సమావేశమైనట్టు తెలుస్తోంది.
ఎస్సీ వర్గీకరణ విషయమై చర్చించేందుకు మాదిగ నేతలు రహస్య సమావేశమైనట్టు తెలుసుకున్న అధిష్టానం ఆ నేతలపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
అసలే పార్టీ ఘోర పరాజయం పాలై, సోషల్ ఇంజనీరింగ్లో అట్టర్ ప్లాప్ అయిందనే బాధ వెంటాడుతుంటే, మరోవైపు రిజర్వేషన్ల తేనెతుట్టెను ఇప్పుడు కదపడం అవసరమా? అని టీడీపీలోని మాల నేతలు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
రహస్య సమావేశమైన మాదిగ నేతలు ఎస్సీ వర్గీకరణపై సమగ్రంగా చర్చించినట్టు తెలుస్తోంది. వర్గీకరణ కోసం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై తీర్మానం చేయాలని నేతలు కోరనున్నారు.
రెండు నెలల క్రితం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ మాదిగ నేతలు సమా వేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఏంటో చూద్దాం.
‘సమాఖ్య వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీలు, సామాజికంగా ఇతరత్రా వెనుకబడిన తరగతులను పైకితేవడానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఉంది. ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్లో మార్పులు, చేర్పులు చేసేంత వరకే పార్లమెంటుకు అధికారం ఉంది.
జాబితాలో ఉన్న వారికి క్షేత్రస్థాయిలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. వెనుకబడిన వారిని పైకితేవాలన్న లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై రాజ్యాంగపరమైన ఆంక్షలేమీ లేవు.
కొన్ని వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి రిజర్వుడ్ సీట్లలో కొంత శాతాన్ని వారికి కేటాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 341, 342, 342ఎల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పలేం’ అని జస్టిస్ అరుణ్మిశ్ర నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.
ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదంటూ 2005లో ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ 2014లో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఇదే సరైన సమయమని టీడీపీ మాదిగ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే నేటి రహస్య సమావేశమని చెప్పక తప్పదు.
మరోవైపు మాదిగలు టీడీపీ వైపు, మాలలు వైసీపీ వైపు ఉన్నారని, కావున ఎస్సీ వర్గీకరణకు పట్టుబట్టడం వల్ల పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని చంద్రబాబును ఒప్పించేందుకు వర్ల రామయ్య, జవహర్ తదితర నేతలు సమాలోచనలు జరిపినట్టు తెలు స్తోంది.
ఒకవేళ జగన్ సర్కార్ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వకపోతే టీడీపీ రెండు విధాలా నష్టపోతుందనే భయం ఆ పార్టీ అగ్రనేతలను వెంటాడుతోంది. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అయినప్పటికీ రాజకీయంగా తలెత్తే లాభనష్టాల గురించి కూడా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు అంటున్నారు.
వర్ల రామయ్య, జవహర్ అనవసరంగా పార్టీని ఇబ్బందులపాలు చేస్తున్నారని టీడీపీ అగ్రనేతలు మండిపడుతున్నట్టు తెలుస్తోంది.