దివంగత నందమూరి హరికృష్ణ కుమారుడు, యంగ్ హీరో నందమూరి తారక రామారావును టీడీపీ టార్గెట్ చేసింది. ఎల్లో మీడియా, సోషల్ మీడియా వేదికలగా ఆయనపై విరుచుకుపడుతుండడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
చంద్రబాబు ట్రాప్‌లో జూనియర్ ఎన్టీఆర్ పడకపోవడమే టీడీపీ ఆగ్రహానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భువనేశ్వరి ఎపిసోడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివిగా వ్యవహరించారు.
ఇదే టీడీపీకి, ఆ పార్టీని మోసే ఎల్లో మీడియాకు అసలు నచ్చడం లేదు. బాబు ట్రాప్‌లో పడని జూనియర్ ఎన్టీఆర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు ఆయన్ను ఒంటరి చేయడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదని చంద్రబాబు, లోకేశ్ సన్నిహితులు వ్యూహాత్మకంగా దాడికి తెగబడుతున్నారు. దీంతో ఆయన్ను టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది.
అలాగే ఎల్లో మీడియా చానళ్లలో జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా టీడీపీ యువ కార్యకర్తలతో మాట్లాడిస్తుండడం చర్చకు దారి తీస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా టీడీపీని, చంద్రబాబును ఆరాధించే వ్యక్తులు, కొన్ని వ్యవస్థలు ట్వీట్లు, కామెంట్స్ చేస్తుండడాన్ని గమనించొచ్చు. భువనేశ్వరి ఎపిసోడ్‌పై సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే…
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలూ సర్వసాధారణం. వ్యక్తిగత దూషణలు ఉండకూడదు. అసెంబ్లీలో జరిగిన సంఘటన నా మనసుని కలిచివేసింది. వ్యక్తిగత దూషణలకు దిగితే అది అరాచక పాలనకు నాంది పలుకుతుంది. స్త్రీ జాతిని గౌరవించడం మన సంప్రదాయం. ఈ మాటల్ని వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన సభ్యుడిగానే మాట్లాడడం లేదు. ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా, దేశ పౌరుడిగా, సాటి తెలుగు వాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి అని జూనియర్ ఎన్టీఆర్ ఎంతో హూందాగా అప్పీల్ చేశారు. ఎన్టీఆర్ విన్నపం అందర్నీ ఆలోచింపజేసింది. వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా జూనియర్ ఎన్టీఆర్ విన్నపంపై సానుకూలంగా స్పందిస్తుండడం విశేషం.
ఇదే ఎల్లో బ్యాచ్‌కు కోపం తెప్పిస్తోంది. వల్లభనేని వంశీ, కొడాలి నానికి అత్యంత సన్నిహితుడిగా జూనియర్ ఎన్టీఆర్‌కు గుర్తింపు వుంది. భువనేశ్వరిపై మొదటగా అభ్యంతరక వ్యాఖ్యలకు వల్లభనేని వంశీనే శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తన మేనత్త భువనేశ్వరిపై దూషణలకు పాల్పడిన, అలాగే చంద్రబాబు కన్నీటిపై మాట మాత్రం కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావించకపోవడం సహజంగానే టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సానుభూతిపరుడైన సీనియర్ జర్నలిస్టు ట్విటర్ వేదికగా వ్యంగ్య ధోరణిలో స్పందించడం… ఎల్లో బ్యాచ్ ఆలోచనలు, ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తోంది.
“సుభాషితాలు బాగున్నాయి” శీర్షికతో సదరు సీనియర్ జర్నలిస్టు ట్వీట్ చేశారు. ఆయన కామెంట్ ఏంటో ఒకసారి చూద్దాం.
“కుటుంబ సభ్యుడిగా కాకుండా సంఘ సంస్కర్తలాగా ఎంతో పరిణతితో మాట్లాడారు. అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎవరిపైన జరిగింది, ఎవరి వల్ల జరిగిందో కూడా ప్రస్తావించకుండా.. నిజంగా అద్భుతం” అని ట్వీట్ చేయడం ద్వారా తన ఆగ్రహాన్ని ఆయన దాచుకోలేక పోయారు. ఎల్లో జర్నలిస్టుకే అంద బాధ, ఆవేదన ఉంటే …పసుపు సైన్యం ఎలా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎల్లో జర్నలిస్టులకు, పసుపు సైన్యానికి తేడా లేదు కాబట్టి.