స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమైపోయాయి. సీఎం జగన్ పై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని, అదే తమకు విజయాల్నిసాధించి పెడుతుదంటూ ఊదరగొడుతున్నారు టీడీపీ నేతలు. ఈసారి టీడీపీ తరపున బరిలో దిగేవారంతా కొత్తవారే, యువకులకే టీడీపీలో ప్రాధాన్యతనిస్తామంటూ చంద్రబాబు సహా ఇతర నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే ఇది యువతపై ప్రేమతో చేస్తున్న పనికాదు, దిక్కులేక, తప్పనిసరి పరిస్థితుల్లో కొత్తవారిని అభ్యర్థులుగా నిలబెట్టబోతోంది టీడీపీ.
దాదాపుగా 13 జిల్లాల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదు. మాజీలు కూడా ఈ దఫా పోటీ చేయడానికి వణికిపోతున్నారు. డబ్బులు వెదజల్లినా, మద్యం ఏరులై పారినా గెలుపు గ్యారెంటీ కాదు అని అసెంబ్లీ ఎన్నికలు తేల్చేశాయి. దీంతో స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ మేనియా అర్థం చేసుకున్న టీడీపీ పాతకాపులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈసారి కొత్తవారికి అవకాశమిస్తామంటూ స్వచ్ఛందంగా వెనక్కి తగ్గుతున్నారు.
దీంతో కొంతమంది యువకులు టీడీపీ నేతల వలలో పడి తమ భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీకి చెందిన కొందరు యువకుల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లిస్తామంటూ తమవైపు తిప్పుకుంటున్నారు టీడీపీ నేతలు. బీజేపీ కలయికతో తమకు టికెట్లు వస్తాయో రావోనని భయపడుతున్న జనసేన నేతలు, టీడీపీలో టికెట్ గ్యారెంటీ అనే మాట తీసుకుని ఫిరాయిస్తున్నారు.
టీడీపీ హయాంలో కోట్లకు కోట్లు వెనకేసుకున్న మాజీ కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు.. తిరిగి ఎందుకు పోటీ చేయడం లేదా అనే ఆలోచన కూడా కొత్తవారికి రావడం లేదు. వారిని అంతలా భ్రమలోకి నెట్టి బలిపశువులుగా సిద్ధం చేస్తున్నారు టీడీపీ నేతలు. అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి విజయం తెచ్చిపెడతాయనే విషయం అందరికీ తెలిసిందే. మహా అయితే అమరావతి ప్రాంతంలో కాస్తో కూస్తో వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతోంది కానీ.. అది కూడా స్థానిక ఎన్నికలయ్యాక వాస్తవమో కాదో తేలిపోతుంది.
ఇక ఈ తొమ్మిది నెలల్లో కొత్తగా టీడీపీ ఎక్కడా పుంజుకున్న దాఖలాలు లేవు. టీడీపీ సీనియర్లకు ఈ విషయాలు తెలుసు కనుకే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు, తాము వెనకుండి బలిపశువుల్ని తయారు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ పరిస్థితి అలా తయారైందన్నమాట.