తెలంగాణలో లాక్ డౌన్ సడలింపులు..!

కర్ఫ్యూ పెట్టడంలో కాస్త వెనకా ముందూ ఆలోచించిన తెలంగాణ సర్కారు, సడలింపుల్లో మాత్రం ఏపీ కంటే ఉదారంగా ఉంది. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల వరకే కర్ఫ్యూ సడలింపులు అమలులో ఉంటే.. తెలంగాణలో 2…

కర్ఫ్యూ పెట్టడంలో కాస్త వెనకా ముందూ ఆలోచించిన తెలంగాణ సర్కారు, సడలింపుల్లో మాత్రం ఏపీ కంటే ఉదారంగా ఉంది. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల వరకే కర్ఫ్యూ సడలింపులు అమలులో ఉంటే.. తెలంగాణలో 2 గంటల వరకు మినహాయింపు ఉంది. ఈ గడువు కూడా రెండ్రోజుల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు లాక్ డౌన్ పై మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. రేపు జరిగే కేబినెట్ భేటీలో లాక్ డౌన్ ఎత్తివేతపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇప్పటి వరకు మధ్యాహ్నం 1 గంటవరకు సడలింపు ఆపై 2గంటల వరకు వాహనదారులకు వెసులుబాటు ఇస్తోంది తెలంగాణ సర్కారు. ఇకపై సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు, ఆపై 6 గంటల వరకు ఆఫీసుల నుంచి, పనిమీద బయటకొచ్చి ఇంటికి తిరిగెళ్లేవారికి వెసులుబాటు ఇవ్వాలనుకుంటోంది. అంటే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ మాత్రమే అమలులో ఉంటుందన్న మాట. ఈమేరకు అధికారులు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.

కరోనా వ్యాప్తికి ఉదయం పూట నిత్యావసరాల కొనుగోలు, మార్కెట్ వ్యవహారాలు ఎంత కారణమో, సాయంత్రం తర్వాత జరిగే పార్టీలు, పబ్బులు, రీక్రియేషన్ కార్యక్రమాలు కూడా అంతే కారణం. ఉదయం వ్యవహారాలపై ఆంక్షలు పెడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు, సాయంత్రం జరిగే తంతు ఆపితే ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టమే కానీ, ప్రజలపై పెద్ద ప్రభావం ఉండదు. అందుకే సాయంత్రం 6వరకే అన్ని కార్యక్రమాలు అనే నిర్ణయం తీసుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం.

లాక్ డౌన్ వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, లాక్ డౌన్ పెట్టడం వల్ల ఎంతమేర రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది అనే విషయాలపై సమగ్ర నివేదికలు కోరారు సీఎం కేసీఆర్. రిజిస్ట్రేషన్లు, ఆబ్కారీ, రవాణా శాఖల నుంచి సమాచారం సేకరించి.. ఆర్థికంగా భారం లేకుండా ఉండే దిశగా కర్ఫ్యూలో సడలింపులు విధించబోతున్నారు.

థర్డ్ వేవ్ పై దృష్టి..

సెకండ్ వేవ్ ని నిర్లక్ష్యం చేసి, అందరికంటే చివరిగా కర్ఫ్యూ విధించిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. అయితే థర్డ్ వేవ్ విషయంలో అలాంటి ఉదాసీనత ఉండకూడదని భావిస్తున్నారు అధికారులు. పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందన్న నేపథ్యంలో ఇప్పటికే నిలోఫర్ ఆస్పత్రిలో వెయ్యి పడకలు సిద్ధం చేస్తున్నారు. 

గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో కూడా పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ఫ్యూ వేళలు సడలించినా.. థర్డ్ వేవ్ ముప్పుపై ముందు చూపుతోనే ఉన్నామంటున్నారు తెలంగాణ అధికారులు.