పిల్లుల పోరుపై పిట్ట ఆశ!

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిదిదనేది సామెత. అయితే పిల్లి- పిల్లి పోరుకు దిగితే, దాని వలన పిట్ట లాభపడుతుందా? అనేది కొత్తగా తెలంగాణ రాజకీయాలు నిరూపించవలసి ఉన్న సత్యం. ఎందుకంటే ఇక్కడ…

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిదిదనేది సామెత. అయితే పిల్లి- పిల్లి పోరుకు దిగితే, దాని వలన పిట్ట లాభపడుతుందా? అనేది కొత్తగా తెలంగాణ రాజకీయాలు నిరూపించవలసి ఉన్న సత్యం. ఎందుకంటే ఇక్కడ అలాంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు.. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మూడూ కూడా అధికారం కోసం తీవ్రస్థాయిలో తలపడుతున్నాయి. చావో రేవో అన్నట్టుగా పోరాటానికి దిగుతున్నాయి.

జాతీయ రాజకీయాలలో రాణించి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరేయాలని ఆశిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సొంత రాష్ట్రం తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడం అనేది తప్పనిసరి అవసరం. భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అదే. మోడీ సర్కారునే పతనం చేస్తానని కేసీఆర్ చేస్తున్న ప్రతిజ్ఞలకు దీటైన జవాబు, కేసీఆర్ ను పతనం చేయడం మాత్రమే అని వారు భావిస్తున్నారు. 

ఇలాంటి సమయంలో, ఇప్పుడు గనుక అధికారంలోకి రాకపోతే ఇక రాష్ట్రంలో తమ పార్టీ పూర్తిగా కనుమరుగు అయిపోతుంది అనే భయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఆ భయానికి తగినట్లుగానే నిత్యం కుమ్ములాడుకుంటూ ఉండే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఒక్క తాటి మీదకు వస్తున్నారు. ఇలా మూడు పార్టీలు కలబడి కొట్టుకుంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం తాము మాత్రమే అని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు.

కేవలం 119 ఎమ్మెల్యే నియోజకవర్గాలు మాత్రమే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలలో ఎవరు ఎన్ని సీట్లు దక్కించుకుంటారు అనేది ఇప్పుడే తేల్చి చెప్పగలిగే సంగతి కాదు. అయితే మజ్లీస్ కు మాత్రం ఏడు నుంచి ఎనిమిది స్థానాలు కచ్చితంగా దక్కుతాయని ఎవరైనా చెబుతారు. వారికి సొంతమైన ఏడు స్థానాలలో ఓడించే ఆలోచన, అందుకు తగిన కసరత్తు కూడా ఏ ఇతర పార్టీలు చేయవు అనేది నిజం. 

అలాంటప్పుడు అగ్ర పార్టీలు మూడింటిలోనూ ఎవరు అధికారంలోకి రావాలనుకున్నా సరే తమ ఏడు సీట్లు వారికి అత్యవసరం అవుతాయని… సంకీర్ణం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రానికి లేదని అసదుద్దీన్ ఓవైసీ ఆలోచనగా ఉంది. భారత రాష్ట్ర సమితితో మజ్లీస్ స్నేహ బంధాన్ని ప్రస్తుతం కొనసాగిస్తూనే ఉన్నది. 

కానీ ప్రస్తుతం ఓవైసీ ఆ ఆలోచనను విడిచిపెట్టినట్టుగా ఉంది. మజ్లీస్ యొక్క బలం తమకు అవసరం లేకపోయినా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వారితో స్నేహపూర్వక సంబంధాన్ని బీఆర్ఎస్ కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు మజ్లీస్ కు ఆ ఉద్దేశం లేదు. దేశవ్యాప్తంగా తమ పార్టీ సొంతంగా బలమున్నచోట్ల పోటీ చేస్తుందని ఆయన అంటున్నారు. 

భారాస పట్ల కూడా ఆయనలో కొంత విముఖత ఉండే అవకాశం కనిపిస్తోంది. దానికంటే, ఎన్నికల తర్వాత బంధాల గురించి నిర్ణయం తీసుకోవడం, తమకు లాభసాటి అవుతుందని ఈ మజ్లీస్ నాయకుడు దూరాలోచన చేస్తున్నారు.