భాగ్ సాలే.. భలే ట్రయిలర్

కొన్ని సినిమాలు ట్రయిలర్ తోనే భలే ఆకట్టుకుంటాయి. ఆ ఒక్క ట్రయిలర్ చాలు, సినిమాకు ఎక్కడ లేని బజ్ తీసుకొస్తుంది. గతంలో డీజే టిల్లూ విషయంలో అదే జరిగింది. అప్పటివరకు ఆ సినిమాను ఒక్కడు…

కొన్ని సినిమాలు ట్రయిలర్ తోనే భలే ఆకట్టుకుంటాయి. ఆ ఒక్క ట్రయిలర్ చాలు, సినిమాకు ఎక్కడ లేని బజ్ తీసుకొస్తుంది. గతంలో డీజే టిల్లూ విషయంలో అదే జరిగింది. అప్పటివరకు ఆ సినిమాను ఒక్కడు కూడా పట్టించుకోలేదు. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో, ఆటోమేటిగ్గా సినిమాపై క్రేజ్ పెరిగింది. ఆ ట్రయిలర్ ఆ రేంజ్ లో ఉంది మరి. ప్రతి ఒక్కరు రిపీట్ చేసుకొని, 10-12 సార్లు చూసిన ట్రయిలర్ అది.

దాదాపు అవే లక్షణాలు ఈరోజు రిలీజైన భాగ్ సాలే సినిమా ట్రయిలర్ లో కనిపిస్తున్నాయి. శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. క్రైమ్ కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ట్రయిలర్ చూడగానే ఆకట్టుకుంది. ట్రయిలర్ చూసిన వెంటనే 'అరె..భలేగా ఉందే' అనే ఫీలింగ్ కలుగుతుంది. అది కచ్చితంగా శ్రీసింహా గొప్పదనం మాత్రం కాదు.

దర్శకుడు ప్రణీత్ ఈ కథకు ఎంచుకున్న పాత్రలు, వాటికి ఇచ్చిన మేనరిజమ్స్ వల్ల భాగ్ సాలేకు ఓ కొత్తదనం వచ్చింది. ట్రయిలర్ అందరికీ నచ్చేలా చేసింది.

ఈ సినిమా ఓ ఉంగరం చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని ట్రయిలర్ కు ముందే విడుదల చేసిన ఓ వీడియోతో, సిద్ధు జొన్నలగడ్డతో వాయిస్ ఓవర్ చెప్పించి మరీ వివరించారు. ఈరోజు రిలీజైన ట్రయిలర్ లో పాత్రలను పరిచయం చేశారు. ప్రతి క్యారెక్టర్ హిలేరియస్ గా ఉంది.

వైవా హర్ష నుంచి మొదలుపెడితే, రాజీవ్ కనకాల, సత్య, సుదర్శన్, 30 ఇయర్స్ పృధ్వీ.. ఇలా అందరితో కామెడీ పండించాడు దర్శకుడు. ప్రతి ఒక్కరికి ఓ మేనరిజమ్ ఇచ్చినట్టు ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. హీరోయిన్ గా నేహా సోలంకి నటించింది.

అయితే ఒక్కటే సమస్య. శ్రీసింహా సినిమాల ట్రయిలర్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. సినిమాలోకి వచ్చేసరికి మాత్రం రివర్స్ కొడతాయి. ఈ భాగ్ సాలే విషయంలో అలా జరగకూడదనే కోరుకుందాం.