ప్రతిపక్షం అంటే ఎలా వ్యవహరిస్తుందో, ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో, ఏ రకంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలో, ఒక క్రమ పద్ధతి ఉంటుంది. నాయకుడుగా రాణించాలనుకుంటున్న వారు ఆ పద్ధతి తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా తమ అజ్ఞానాన్ని ప్రదర్శించాలనుకుంటేనే పరువు పోతుంది. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే విధంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడ్డగోలుగా దూషించడం ఒక్కటే తన జీవితపు పరమ లక్ష్యం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారు. ఎడాపెడా ముఖ్యమంత్రి మీద నిందలు కురిపిస్తూ ఉంటారు. జగన్ దిగిపోవాలని, ఆయన రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని.. ఎందుకో ఏమిటో వివరించకుండా ఆరోపణలు మాత్రం చేయడం పవన్ కళ్యాణ్ శైలి. అలాంటి పవన్ కళ్యాణ్ తాజాగా ఆరోగ్యశ్రీ ప్రస్తావన తెచ్చారు.
జనసేన అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీని మించిన ఇన్సూరెన్స్ పథకం ప్రజల కోసం తీసుకువస్తాను అంటూ పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా ఘనమైన హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సిన సంగతి ఒకటి ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకం గురించి ప్రజల్లో దాని ద్వారా లబ్ధి పొందుతున్న పేదలలో ఏమైనా అసంతృప్తి ఉన్నదా? అలాంటి అసంతృప్తి ఉన్నట్లయితే దానికి సంబంధించి ఏ చిన్న హామీ ఇచ్చినా సరే.. ప్రజలు ఆ హామీ పట్ల ఆకర్షితులవుతారు. అలాకాకుండా ప్రజలు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా సేవలు పొందుతున్న ఒక పథకం గురించి- అంతకంటే గొప్పగా నేను చేస్తాను అని అనడం వలన పవన్ కళ్యాణ్ ఏం సాధిస్తారు.. ప్రజలలో మెదడుతున్న పెద్ద సందేహం ఇది.
పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ పథకం వైయస్ రాజశేఖర్ రెడ్డి మదిలో పుట్టిన ఆలోచన. కాలక్రమంలో అది కాస్త కాస్త మెరుగుపడుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలోకి అనేక అనేక దీర్ఘ రోగాలను కూడా కొత్తగా జత చేశారు. దీనివలన ఎలాంటి ఆరోగ్య ఇబ్బంది ఉండే వారికి కూడా కార్పొరేట్ చికిత్సలపరంగా లోటు ఉండదు. కాగా ఇంతకంటే మెరుగైన పథకం తెస్తానని ప్రజలను మభ్యపెట్టడం ఎలా సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ ఊహించారో అర్థం కాదు.
జగన్ చేయకుండా మిగిలిపోయిన పనులు, సమర్థంగా చేయలేకపోతున్న పనులు గురించి ఏదైనా వాగ్దానాలు చెబితే కాసిని ఓట్లు గిట్టుబాటు అవుతాయి గాని, ఆరోగ్యశ్రీ లాంటి మంచి పథకం, అద్భుతంగా అమలవుతున్న పథకం గురించి నోరు పారేసుకుంటే పవన్ కళ్యాణ్ కు ఏమొస్తుంది అని ప్రజలు నవ్వుకుంటున్నారు.