అమిత్ షా సభకు వేదిక మార్చాల్సిందే!

తెలంగాణలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి వచ్చి తీరాలని భారతీయ జనతా పార్టీ తపన పడిపోతోంది. అందుకు తగ్గట్టుగా వ్యూహ రచనలు సిద్ధం చేసుకుంటోంది. మోడీ తొమ్మిదేళ్ల పాలన విజయాల గురించి ప్రచార…

తెలంగాణలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి వచ్చి తీరాలని భారతీయ జనతా పార్టీ తపన పడిపోతోంది. అందుకు తగ్గట్టుగా వ్యూహ రచనలు సిద్ధం చేసుకుంటోంది. మోడీ తొమ్మిదేళ్ల పాలన విజయాల గురించి ప్రచార సభలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ పిలుపు ఇస్తే.. తెలంగాణలో ఏకంగా అమిత్ షా, జెపి నడ్డా, నరేంద్రమోడీలతో సభలు ప్లాన్ చేసింది. 

పార్టీ కాస్త బలహీనంగా ఉన్నదని భావిస్తున్న ఖమ్మం జిల్లాలోనే తమ సత్తా చాటే ఉద్దేశంతో అమిత్ షా సభను అక్కడ ఏర్పాటుచేశారు. తీరా.. ఏర్పాట్లన్నీ అయ్యాక గుజరాత్ వరదల వల్ల అది వాయిదా పడింది. అయితే ఇప్పుడు తాజాగా పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్న‌ సమాచారాన్ని బట్టి.. అమిత్ షా సభ నిర్వహించడానికి కొత్త వేదికను అన్వేషించాలని పార్టీ అనుకుంటున్నది.

ఖమ్మంలో కాకుండా.. మరెక్కడైనా నిర్వహించాలని తలపోస్తున్నారట. ఇందుకు వారి కారణాలు వారికి ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన భారాస నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరూ కాంగ్రెసు పార్టీలో చేరడం ఖరారైంది. ఫైనల్‌గా, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం వీరిని కలిసి లాంఛనంగా తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. 

ఈ నెల 25న వీరిద్దరూ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి పార్టీలో తాము ఆశిస్తున్న ప్రాధాన్యం గురించి చర్చిస్తారు. 26న ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి.. కాంగ్రెసులో చేరుతున్న సంగతిని కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత.. జులై 2 వ తేదీన ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో వీరు, అనుచరులు, ఇతర నాయకులు అనేకమందితో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారు. 

ఇలా షెడ్యూలు ఖరారైంది. బిజెపి పరిస్థితి చూస్తే.. అమిత్ షా సభను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ఇప్పటిదాకా షెడ్యూలు రాలేదు. జులై 2 లోగా అదే ఖమ్మంలో నిర్వహించగలిగితే పరిస్థితి ఒక తీరుగా ఉంటుంది. అలా కుదరకపోతే.. సభా నిర్వహణకు వేదికను మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. రాహుల్ గాంధీ వచ్చే సభను జులై 2న పొంగులేటి ఆధ్వర్యంలో నిర్వహించినప్పుడు.. దానిని అత్యంత భారీగా, భారీ జనసమీకరణతో నిర్వహిస్తారని అంచనా వేయవచ్చు. దాని తర్వాత బిజెపి- అమిత్ షా సభ నిర్వహిస్తే.. ఆ సభకు పోటీగా జనసమీకరణ చేయాల్సి ఉంటుంది. 

అసలే ఖమ్మం జిల్లాలో పార్టీ వీక్ అనుకుంటుండగా.. పొరుగు జిల్లాలనుంచి తరలించినా కూడా.. కాంగ్రెస్ సభను తలదన్నేలా నిర్వహించడం సాధ్యం కాదని పార్టీ నాయకుల అంచనా. అదే జరిగితే గనుక.. అమిత్ షా సభ వలన అదనపు మైలేజీ రావడానికి బదులుగా, తమ వీక్ నెస్ బయటపడి పరువుపోతుందని వారు ఆలోచిస్తున్నారు. 

అందుకే జులై 2 తర్వాత అమిత్ షా సభ నిర్వహించేట్లయితే ఖమ్మం కాకుండా, రాష్ట్రంలో బిజెపి ప్రాబల్యం బాగా ఉన్న చోట నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.