బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడి…ఆస్ప‌త్రిపాలు

ఇటీవ‌ల దుబ్బాక బీఆర్ఎస్ అభ్య‌ర్థి, ఎంపీ కొత్త‌కోట ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై క‌త్తి దాడి మ‌రిచిపోక‌నే, అధికార పార్టీకి చెందిన మ‌రో ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జ‌రిగింది. వ‌రుసగా అధికార పార్టీ అభ్య‌ర్థుల‌పై దాడులు బీఆర్ఎస్‌లో క‌ల‌వ‌రం…

ఇటీవ‌ల దుబ్బాక బీఆర్ఎస్ అభ్య‌ర్థి, ఎంపీ కొత్త‌కోట ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై క‌త్తి దాడి మ‌రిచిపోక‌నే, అధికార పార్టీకి చెందిన మ‌రో ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జ‌రిగింది. వ‌రుసగా అధికార పార్టీ అభ్య‌ర్థుల‌పై దాడులు బీఆర్ఎస్‌లో క‌ల‌వ‌రం క‌లిగిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ శ్రేణుల దాడిలో నాగ‌ర్‌క‌ర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ అభ్య‌ర్థి, ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన గువ్వ‌ల బాలరాజు గాయ‌ప‌డ్డారు.

అచ్చంపేట‌లో గ‌త అర్థ‌రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బీఆర్ఎస్ నాయ‌కులు కారులో డ‌బ్బు త‌ర‌లిస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగాయి. కారులో డ‌బ్బు సంచులున్నాయ‌ని, స్వాధీనం చేసుకోవాలంటూ పోలీసుల‌ను కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు. కారును అడ్డుకున్నారు. ఈ విష‌యమై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల‌రాజుకు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు స‌మాచారం అందించారు.

దీంతో ఆయ‌న సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివ‌రికి ప‌ర‌స్ప‌రం రాళ్లు, క‌ర్ర‌ల దాడికి దిగే ప‌రిస్థితి. కాంగ్రెస్ కార్య‌క‌ర్త విసిరిన రాయి ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు ముఖానికి త‌గిలింది. ర‌క్త‌గాయం కావ‌డంతో ఆయ‌న్ను వెంట‌నే ఇంటికి తీసుకెళ్లారు. 

ఇంటి ద‌గ్గ‌ర ఆయ‌న స్పృహ త‌ప్ప‌డంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళ‌న‌కు గుర‌య్యాయి. వెంట‌నే ఆయ‌న్ను హైద‌రాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు వైద్యులు తెలిపారు.