చంద్ర‌బాబు అరెస్ట్‌.. తెగ బాధపడిపోతున్న బండి సంజ‌య్‌!

ఏపీ స్కిల్ డెవెల‌ప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్ర‌బాబుపై సొంత పార్టీ నేత‌ల కంటే ప‌క్క పార్టీలో ఉండేవారికే ఎక్కువ బాధ క‌లుగుతోంది. మ‌రి ముఖ్యంగా బీజేపీలో ఉండి…

ఏపీ స్కిల్ డెవెల‌ప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్ర‌బాబుపై సొంత పార్టీ నేత‌ల కంటే ప‌క్క పార్టీలో ఉండేవారికే ఎక్కువ బాధ క‌లుగుతోంది. మ‌రి ముఖ్యంగా బీజేపీలో ఉండి టీడీపీ మ‌నుషులుగా గుర్తింపు పొందిన నాయ‌కులు మ‌రియు జ‌న‌సేన అధినేత బాధ చెప్ప‌లేనిది. తాజాగా కరీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ చంద్ర‌బాబు అరెస్ట్‌ను ఖండిస్తూ చంద్ర‌బాబుకు మైలేజ్ పెరిగిందంటూ జోస్యం చెప్పారు.

బండి సంజ‌య్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబును రాజ‌కీయ క‌క్ష‌తోనే అరెస్ట్ చేశార‌ని.. ఎఫ్ఐఆర్ లో పేరు లేని వ్య‌క్తిని అరెస్ట్ చేయ‌డం అర్థం కావ‌ట్లేద‌ని బాధ‌ప‌డిపోయారు. ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబు అరెస్ట్ వ‌ల్ల ఆయ‌న‌కు మైలేజ్ పెరిగింద‌ని జోస్యం చెబుతూ.. అరెస్ట్ అక్ర‌మమంటూ ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఏపీ ప్ర‌భుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

తెలంగాణ‌లో చంద్ర‌బాబు శిష్యుడిగా గుర్తింపు పొందిన టీపీసీసీ రేవంత్ రెడ్డి మొద‌లు.. బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హారీష్ రావులు కూడా అరెస్ట్‌పై ఆ రాష్ట్ర స‌మ‌స్య అంటూ త‌ప్పించుకున్నారు త‌ప్పా బండి సంజ‌య్ లాగా నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌లేదు. మ‌రోవైపు చంద్ర‌బాబు అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు మ‌ట్లాడుతూ “ప్ర‌జాస్వామ్య దేశంలో గ‌తంలో కూడా చాలా మంది ముఖ్య‌మంత్రులు, మాజీ ముఖ్య‌మంత్రులు, ప్ర‌ధాన‌మంత్రులు, వారి కుటుంబ స‌భ్యులు అరెస్ట్ అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏం జ‌రిగిందో నాకింకా తెలియ‌దు. కానీ రెండు మూడు నెలల్లో ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ వ‌స్తోంది. ఈ స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని అరెస్ట్ చేసే సాహ‌సం పాల‌క ప‌క్షం చేసిందంటే… సాక్ష్యాలు, ఆధారాలు వుంటేనే చేస్తారు. అంతే త‌ప్ప ఎన్నిక‌ల ముందు ప్ర‌తిప‌క్ష నాయకుడిని అరెస్ట్ చేసి, వారికి సానుభూతి వ‌చ్చేలా అరెస్ట్ చేస్తార‌ని నేను అనుకోను”  అని ఆయ‌న అన్నారు.

చంద్ర‌బాబునాయుడు త‌ప్పు చేశార‌ని, అవినీతికి సంబంధించి ఆధారాలు, సాక్ష్యాలు ప‌క‌డ్బందీగా పెట్టుకునే అరెస్ట్ చేశార‌ని ఒక‌వైపు అంటుంటే చంద్ర‌బాబు అనుకూల నాయ‌కులు మాత్రం తెగ‌బాధ‌ప‌డిపోతున్నారు. మ‌రి బండి సంజ‌య్ మాటలు ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబును వెన‌కేసుకు వ‌చ్చారా లేక బీజేపీ పార్టీ నుండా అనేది ఆయ‌నే చెప్పింటే అంద‌రికి అర్థం అయ్యేది. ఎందుకంటే ఈ మ‌ధ్య‌కాలంలో ఆయ‌న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.