స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు రాజకీయ దుమారం రేపుతోంది. ఒక కేసులో రాజకీయ పార్టీ నేత అరెస్టు అయితే సంబంధించిన పార్టీ రాజకీయంగా ఇబ్బంది పడుతుంది. ఒకవేళ అక్రమ కేసులు పెట్టారని భావిస్తే అధికారంలో ఉన్న పార్టీ రాజకీయంగా ఇబ్బంది పడుతుంది. చంద్రబాబు అరెస్టుతో అధికార పార్టీ సరికొత్త సవాల్ ను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. అది ఎలా అంటే….
ఏపీలో మెజార్టీ సమాజం రాజకీయంగా తెలుగుదేశం- వైసీపీగా విడిపోయింది. రెండు పార్టీలను ప్రేమించే ప్రజలు విషయంతో సంబంధం లేకుండా తాము అభిమానించే పార్టీల వైపు ఉంటారు. అంటే ఈ ప్రజలు చంద్రబాబు అరెస్టు విషయంలో ఏమీ మారరు. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయం తీసుకునే సమాజం కూడా ఏపీలో గణనీయంగా ఉంది. వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ప్రాతిపదికన రాజకీయ పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
నిర్లిప్తత ఎటు వైపు మొగ్గు చూపనుంది?
అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయిన నేపథ్యంలో రాజకీయంగా తెలుగుదేశం, వైసీపీగా చీలి ఉన్న సమాజం ఈ విషయంలో కూడా తమ పార్టీల వైపు ఉంటుంది. కానీ తటస్థంగా ఉండే సమాజం చంద్రబాబు అరెస్టును ఎలా చూస్తుంది అన్నది కీలకం కానుంది. అరెస్టు తదనంతర పరిణామాలు చూస్తుంటే తటస్థుల్లో నిర్లిప్తత కనపడుతోంది. చంద్రబాబు అరెస్టు కక్ష తీర్చుకొనేందుకు అన్న తెలుగుదేశం వాదనతో గాని, అలాగే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్న అధికార పార్టీ ఆరోపణలును అసలు పట్టించుకోవడం లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. అవినీతికి ఎవరు మినహాయింపు? ఈ పరిస్థితులే నిర్లిప్తతకు మూలంగా కనిపిస్తోంది. వీరిలో వ్యక్తం అవుతున్నది ఏమిటంటే ఈ రాజకీయ పార్టీల మధ్య ఎప్పుడు ఇవేనా? అన్న అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసహనం, నిర్లిప్తత ఎన్నికల నాటికి ఎటు వైపు టర్న్ తీసుకుంటుందన్న దాని బట్టి రాజకీయపార్టీల భవిష్యత్ ఆధార పడి ఉంటుంది.
తెలుగుదేశం కకావికలం అవుతుందా ?
అధికార పార్టీ నుంచి వ్యక్తం అవుతున్న భావన చంద్రబాబు అరెస్టు కావడం వల్ల తెలుగుదేశం శ్రేణులలో గందరగోళం ఏర్పడి, నాయకత్వ లోపం వల్ల పార్టీని సమర్థవంతంగా నడపలేరని. లోకేష్ విజయం సాధించలేరని. ఈ అంచనా సరికాదు లోకేష్ నాయకత్వ పరిణతి ఏమిటన్నది కాలం నిర్ణయిస్తుంది. ప్రజలలో వ్యక్తం అయ్యే భావాలకు పార్టీలు రూపం మాత్రమే. అంతా పార్టీలు కాదు. పార్టీలు సామర్థ్యం బట్టే రాజకీయ ఫలితాలు ప్రతిబింబించకపోవచ్చని అనేక ఉదంతాలు తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు గత MLC ఎన్నికల్లో (పట్టభద్రులు) తెలుగుదేశం పూర్తిగా చేతులెత్తేసింది. కేవలం వారు పోటీ చేసింది అధికార పార్టీ గెలుపు అక్రమాలతో అని చెప్పుకోవడానికి మాత్రమే.
ఇది అతిశయోక్తి కాదు. ఎన్నికలు జరిగిన సాయంత్రం తెలుగుదేశం అనుకూల మీడియా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఇలాంటి గెలుపు ఒక గెలుపెనా? చివరకు ఓటర్లును కూడా నిందించారు. పోటీ చేసిన పార్టీ ప్రజల నాడి తమకు తెలుసు అనుకునే మీడియా పెద్దలు కూడా ఊహించని విధంగా తెలుగుదేశం పెద్ద విజయాన్ని సాధించింది. అంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటే పార్టీలను చూడరని ఈ ఉదంతం తెలుపుతుంది. మరి తెలుగుదేశం అధినేత అరెస్టుతో ఆ పార్టీ రాజకీయంగా సమర్థవంతంగా పనిచేయదు, లోకేష్ నడపలేరు అన్న అంచనా ఎలా నిజం అవుతుంది ?
అధికార పార్టీ ముందు పెద్ద సవాల్…
చంద్రబాబు అరెస్టును పార్టీల కతీతంగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించే సమాజం ఎలా చూస్తుంది అన్నది ప్రదానం. అరెస్టు తదనంతర పరిణామాలను పరిశీలిస్తే ఈ తరగతి ప్రజలలో అసహనం తప్ప ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో ఈ అసహనం అధికార, ప్రతిపక్ష పార్టీలో ఏదో ఒక పార్టీ మీద కాకుండా ఇద్దరి వ్యవహార శైలి మీదా కనపడుతోంది.
చంద్రబాబు అరెస్టు కారణంగా అనివార్యంగా తెలుగుదేశం శ్రేణులు తమ శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకొని రాజకీయ కక్షతో తమ అధినేతను అరెస్టు చేశారని ప్రజల్లోకి వెళతాయి. అదే సమయంలో అధికార పార్టీ చంద్రబాబు తప్పు చేశారని తెలుగుదేశం శ్రేణులు వెళ్లినంత స్థాయిలో వెళ్లగలదా? ఎవరు ఏమీ చేయలేని చంద్రబాబును జగన్ అరెస్టు చేయగలిగారు అన్న సంతృప్తి వైసీపీ శ్రేణుల్లో ఉన్నా ఆ సంతృప్తి తమ అధినేత అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం శ్రేణులు ప్రజల్లోకి వెళ్లినంత స్థాయిలో వైసీపీ శ్రేణులు వెళతాయా? అన్నదే ఆ పార్టీ ముందు ఉన్న పెద్ద సవాల్.
అవినీతిపై రెండు పార్టీల ఆరోపణలు ప్రతి విమర్శలను పట్టించుకోకుండా అసహనం వ్యక్తం చేస్తున్న సమాజ నిర్లిప్తత ఇప్పుడు రెండు పార్టీలకు పెద్ద సమస్య. ఈ మొత్తం వ్యవహారంలో తమ నేతను ఎన్నికల సమయంలో అన్యాయంగా అరెస్టు చేశారని తెలుగుదేశం శ్రేణులు, తప్పు చేశారు కాబట్టి అరెస్టు చేశారని అధిక పార్టీ శ్రేణులలో ఏ పార్టీ శ్రేణులు… నిర్లిప్తంగా ఉన్న సమాజాన్ని ఒప్పించగలరన్నదాన్ని బట్టి వచ్చే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నది.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, తిరుపతి.`