కేంద్ర కేబినెట్లో బండికి ఛాన్స్! ఏపీ నుంచి?

ఎట్టకేలకు మోడీ సర్కారు మరోసారి కేంద్ర మంత్రి వర్గంలో మార్పు చేర్పులకు సిద్ధమైంది. శని, ఆదివారాల్లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తగినవిధంగా పార్టీని పటిష్టం చేసే, ఉపయోగపడే…

ఎట్టకేలకు మోడీ సర్కారు మరోసారి కేంద్ర మంత్రి వర్గంలో మార్పు చేర్పులకు సిద్ధమైంది. శని, ఆదివారాల్లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తగినవిధంగా పార్టీని పటిష్టం చేసే, ఉపయోగపడే వ్యూహంతో టీమ్ లను సిద్ధం చేసుకోవడమే టార్గెట్ గా కనిపిస్తోంది. 

సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఈ ఏడాదిలో మరి కొన్ని నెలల్లో జరగబోతున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీని విజయపథంలో నడిపించడం లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ మొత్తం మార్పు చేర్పుల్లో కొన్ని రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర పార్టీ సారథ్యం నుంచి ఉద్వాసనకు గురైన బండి సంజయ్ కు ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం బిజెపి వర్గాల్లో జరుగుతోంది. 

ఒకవైపు భాజపా వ్యతిరేక పార్టీలన్నీ జట్టు కడుతూ ఉండగా.. దానికి పోటీగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను ఐక్యంగా ఉంచుకోవడానికి కూడా కేంద్ర కేబినెట్ విస్తరణను ఒక పావుగా వాడుకునే అవకాశం ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో చీలిన శివసేన వర్గానికి, అజిత్ పవార్ నేతృత్వంలో చీలిన ఎన్సీపీ వర్గానికి కూడా కేంద్ర కేబినెట్ పదవులు దక్కుతాయని తెలుస్తోంది. అజిత్ పవార్ వర్గంలోని ప్రఫుల్ పటేల్ కు కూడా కేబినెట్ పదవి దక్కే అవకాశం ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చి తీరుతామని బిజెపి ప్రకటిస్తూ ఉంది. అధికారంలోకి రాకపోయినా సరే.. ఆ స్థాయిలో పార్టీ బలపడాలని అనుకుంటోంది. అలాంటి నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నాయకత్వ మార్పు కూడా జరిగింది. 

అయితే ఇన్నాళ్లుగా పార్టీకి సారథ్యం వహిస్తూ కేసీఆర్ సర్కారు మీద విరుచుకుపడిన బండి సంజయ్ ను పూర్తిగా పక్కన పెట్టడం అనేది వ్యూహాత్మకంగా కూడా పార్టీకి మంచిదికాదు అని వారు భావిస్తున్నారు. అందుకే ఆయనకు కేంద్రమంత్రిపదవి కట్టబెట్టి రాష్ట్రంలో ఆయన దూకుడు అలాగే కొనసాగడానికి వాడుకోవాలని చూస్తున్నారు. 

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తమ పార్టీని ఎంతో కొంత బలోపేతం చేసుకోవాలనే కోరిక భారతీయ జనతా పార్టీకి ఉంది. సార్వత్రిక ఎన్నికలను అందుకు వాడుకోవాలని కూడా అనుకుంటున్నారు. అందుకు తగినట్టుగా.. ఆ రాష్ట్రం నుంచి ఎవరికైనా కేంద్రమంత్రి పదవి ఇస్తారా అనే చర్చ పార్టీలో నడుస్తోంది. 

ఏపీ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. అనేకానేక కులసమీకరణల నేపథ్యంలో బండి సంజయ్ కు మాత్రం పదవి గ్యారంటీ అని, కిషన్ రెడ్డి ని కేబినెట్లో కొనసాగించాలా అక్కర్లేదా అనే విషయంలో ఇంకా నిర్ణయం జరగలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.