జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి తప్పుడు ప్రచారాలు కొనసాగించే విషయంలో.. తెలుగుదేశం పార్టీ వారి అమ్ముల పొదిలో ఉన్న అన్ని బుల్లెట్లు అయిపోయాయి! ఇప్పుడు సరికొత్త నిందలను, సరికొత్త అబద్దాలను వారు వెతుక్కోవలసి వస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ పర్యటనకు వెళ్లి, అక్కడ ప్రధానమంత్రిని కలిస్తే దానికి ఆ భేటీకి రకరకాల రంగులు పులిమి ప్రచారం చేయడం అనేది పచ్చదళాలకు మొదటినుంచి అలవాటే. ఈ దఫా ఆ తప్పుడు ప్రచారాన్ని ముందస్తు ఎన్నకలకు ముడిపెడుతున్నారు. అలా ముడిపెడితే తమ పబ్బం గడుస్తుందని ఆశపడుతున్నారు.
జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ తనమీద కేసులను మాఫీ చేయించుకోవడానికే ఆయన ప్రధానిని, హోం మంత్రిని కలుస్తున్నారని నానా అవాకులు చవాకులు పేలుతూ తెలుగుదేశం నాయకులు గతంలో ప్రకటనలు గుప్పించేవాళ్లు. కొన్ని సంవత్సరాలు సాగించిన ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని వారికి అర్థమైంది.
గత ఏడాదికాలంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తప్పించడానికి ఢిల్లీ వెళుతున్నారని, కేవలం అందుకోసమే ప్రధానిని హోంమంత్రిని కలుస్తున్నారని రెండో విషపు బుల్లెట్టును ప్రయోగించారు. కానీ అబద్ధాలను ఛీ కొట్టే ప్రజల ఎదుట ఈ విష ప్రయోగం తుస్సుమంది. ఇప్పుడు సీఎం ఢిల్లీకి వెళ్తే కొత్త ప్రచారం ప్రారంభించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారని, అందుకు ప్రధాని నరేంద్ర మోడీని అనుమతి కోరారనేది ఈ ప్రచారం! ఇంతకంటే కామెడీ విమర్శ ఇంకొకటి ఉండదు. తెలుగుదేశం నాయకులు ఎంతగా దిగజారుడు లేకి ప్రకటనలు చేస్తున్నారంటే.. జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలన్నా లేవాలన్నా ఢిల్లీ వెళ్లి ప్రధాని అనుమతి అడిగి వస్తారు అనే తరహాలో రంగులు పులుముతున్నారు.
అసెంబ్లీ రద్దు అనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టం! ఆయన దానికోసం ప్రధానికి మాటమాత్రంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. అయితే తెలుగుదేశం స్వార్ధ ఆలోచనలతోనే ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారాన్ని భుజానికెత్తుకుంటున్నట్లుగా కనిపిస్తుంది.
వైసీపీ నాయకులు ‘ముందస్తు ఉండదు’ అని ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా పచ్చదళాలు అదేపనిగా ప్రచారం చేస్తున్నాయి. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఎపిసోడ్ మీద చిత్రీకరణ జరుగుతున్న యాత్ర 2 సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని సంకల్పిస్తున్నారు.
ఆ సినిమా ప్రజల ఎదుటకు వస్తే ఖచ్చితంగా పాదయాత్ర రూపంలో వైయస్ జగన్ సామాన్య జనులతో పేదలతో ఎంతగా మమేకమయ్యారో మళ్లీ ఒకసారి గుర్తుచేస్తుంది. తద్వారా ప్రస్తుతం ఆయనకు ఉన్న ప్రజాదరణ మరిన్ని రెట్లు పెరుగుతుంది కూడా! అలాంటి అద్భుతమైన అవకాశం ఉండగా దాని కంటే ముందే, ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారు? జగన్ ముందస్తుని ఎందుకు కోరుకుంటాడో చెప్పడానికి తెలుగుదేశం వద్ద ఒక్క లాజిక్ కూడా లేదు.
కానీ ‘ముందస్తు ఉండబోదు, ప్రజల తీర్పు మేరకు చివరి రోజు వరకు పరిపాలన సాగిస్తాం’ అంటున్న వైయస్సార్ కాంగ్రెస్ మాటలు నమ్మడానికి అనేక లాజిక్ లు మనకు దొరుకుతాయి! యాత్ర 2 సినిమా విడుదల మాత్రమే కాదు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు అనే విపక్షా ప్రచారాలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా ఏ నెల కూడా ఆలస్యం కాకుండా సంక్షేమ పథకాలు అందుతూ ఉండడమే మరో రుజువు. ఇలాంటి ఆసంబద్ధ అబద్ధపు ప్రచారాలను మానుకోకుంటే తెలుగుదేశం పార్టీని ప్రజలు దారుణంగా ఛీకొడతారు.