పవన్.. మళ్లీ గోదావరే.. టార్గెట్ కులమే!

జనసేనాని పవన్ కల్యాణ్ తన రెండోవిడత వారాహియాత్రకు ముహూర్తం నిర్ణయించారు. అయితే జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకున్నట్టుగా ఇది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మొదలు కావడంలేదు. మళ్లీ గోదావరి జిల్లాల్లోనే జరగబోతోంది. ఈ…

జనసేనాని పవన్ కల్యాణ్ తన రెండోవిడత వారాహియాత్రకు ముహూర్తం నిర్ణయించారు. అయితే జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకున్నట్టుగా ఇది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మొదలు కావడంలేదు. మళ్లీ గోదావరి జిల్లాల్లోనే జరగబోతోంది. ఈ నెల 9వ తేదీన ఏలూరులో పవన్ కల్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత.. వారాహి-1 లో టచ్ చేయని నియోజకవర్గాలలో పవన్ కల్యాణ్ పర్యటన ఉంటుంది.

పాదయాత్ర లాంటివి చేస్తున్న సందర్భాల్లో తప్ప.. వారాహి యాత్ర లాంటివి ఒక ప్రాంతంలో మొదటి విడత నిర్వహించిన తర్వాత.. రెండో విడత అనేది రాష్ట్రంలోని మరో ప్రాంతంలో నిర్వహిస్తుంటారు. పైగా పవన్ కల్యాణ్ ఇప్పటికే రాయలసీమలోని పార్టీ నాయకులను, అభిమానులను ఒక విడత నిరుత్సాహపరిచారు. వారాహి యాత్ర అనేది తిరుపతినుంచి ప్రారంభం అవుతుందని తొలుత ప్రకటించారు. కానీ.. ఆచరణలోకి వచ్చేసరికి గోదావరి జిల్లాల్లోనే ప్రారంభించారు. అయితే రెండో విడత వారాహి యాత్రను ఖచ్చితంగా తిరుపతినుంచి ప్రారంభిస్తారని అక్కడి అభిమానులు నిరీక్షించారు. 

అదే సమయంలో.. కీలకమైన గోదావరి జిల్లాల్లో తన పర్యటన మొదలు పెట్టారు గనుక.. పవన్ ఎంతో ప్రేమను చూపిస్తూ ఉండే ఉత్తరాంధ్ర ప్రాంతంలో రెండో విడత వారాహి యాత్ర ఉంటుందని కూడా కొందరు అనుకున్నారు. అయితే అలాంటి అంచనాలకు, అభిమానుల కోరికలకు భిన్నంగా.. మళ్లీ గోదావరి జిల్లాల్లోనే రెండో విడత వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు.

ఇలాంటి వ్యూహం వెనుక జనసేనాని పవన్ కల్యాణ్ కేవలం కుల సమీకరణలనే ప్రధానంగా పరిగణిస్తున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కాపుల ప్రాబల్యం, సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో.. ఈసారి ఎన్నికల్లో ఆ జిల్లాల్లో మేగ్జిమమ్ ఫోకస్ పెట్టి లబ్ధి పొందాలని పవన్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. 

గత ఎన్నికల్లో కూడా కేవలం కులం బలాన్ని నమ్ముకుని పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకల్లో పోటీచేశారు. రెండు చోట్లా భంగపాటు తప్పలేదు. అయితే అప్పటికీ ఇప్పటికీ కులం ఓట్లలో చాలా తేడా ఉన్నదని, కులం పోలరైజేషన్ జనసేనకు అనుకూలంగా జరిగిందని పవన్ భావిస్తున్నారు. 

అందుకే రెండో విడత యాత్రను కూడా పూర్తిగా గోదావరి జిల్లాల్లోనే చేయబోతున్నట్టు తెలుస్తోంది. 9వ తేదీన ఏలూరు బహిరంగ సభ తర్వాత.. దెందులూరు, తాడేపల్లి గూడెం, తణుకు, ఉంగుటూరు తదితర నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు.