బీజేపీతో దోస్తీకి టీడీపీ దోబూచులాట అడుతోంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా లబ్ధి కలుగుతుందని, బీజేపీతో ప్రయోజనం ఉండదనే అభిప్రాయంతో టీడీపీ వుంది. కానీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో బీజేపీ అధికారం అవసరమని టీడీపీ భావిస్తోంది. మరోవైపు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు హక్కుగా రావాల్సిన వాటిలో ముఖ్యమైన వాటిని నెరవేర్చడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని, దీంతో బీజేపీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వుంది.
ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ నెగెటివిటీ తమపై కూడా పడుతుందని టీడీపీ భయపడుతోంది. తమకు కేంద్రంలోని బీజేపీ మద్దతు వుందనే సాకుతో వైఎస్ జగన్‌ను బ్లాక్ మెయిల్ చేసి, తద్వారా ఆయన్ను భయపెట్టాలనే ఎత్తుగడలో టీడీపీ వుంది. ఇందులో భాగంగానే ఈ నెల 18న ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి కూడా ఆహ్వానం అందిందనే ప్రచారాన్ని ఎల్లో మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారంలోకి టీడీపీ తీసుకొచ్చింది. ఈ ప్రచారంపై జన స్పందనను టీడీపీ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇలాంటి జిమ్మిక్కులు చేయడంలో టీడీపీకి అలవాటైన విద్యే. ఎన్డీఏ సమావేశానికి తాము హాజరవుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని మరోవైపు టీడీపీ స్పష్టం చేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేసిన బీజేపీతో రాజకీయంగా కలిసి నడిచేందుకు ఒకవైపు భయపడుతూ, మరోవైపు అదే పార్టీని అడ్డుపెట్టుకుని వైసీపీని భయపెట్టేందుకు టీడీపీ ఆలోచిస్తూ, ఎటూ తేల్చుకోలేకపోతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు, దళితులు, గిరిజనులు దూరమవుతారని టీడీపీ వణికిపోతోంది.
అయితే చంద్రబాబుకు గ్రాఫ్ పెరగడం వల్లే ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నారని, ఇక పొత్తు కుదరడమే తరువాయి అంటూ ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఊదరగొడుతోంది. టీడీపీకి నష్టం కలిగించేందుకు ఎల్లో మీడియా వుంటే చాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్లో మీడియా అత్యుత్సాహంతో బీజేపీతో పొత్తు బంధం ఏర్పడినట్టు చెబుతోంది. దీంతో టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని వర్గాలు బీజేపీ ఎఫెక్ట్‌తో ఆ పార్టీకి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. బీజేపీతో పొత్తు వుంటే లాభనష్టాలపై టీడీపీ అంచనా వేస్తోంది.
దాన్ని బట్టి భవిష్యత్‌లో ఒక నిర్ణయానికి వస్తుంది. ఆలోచన దశలోనే ఎల్లో మీడియా …వైఎస్ జగన్‌ను భయపెట్టే క్రమంలో టీడీపీని రాజకీయంగా భ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తోంది. ఎల్లో చానళ్లలో గంటల తరబడి డిబేట్స్ పెట్టడం దేనికి సంకేతం? ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతోందా? లేక టీడీపీకి లాభం కలిగిస్తున్నామనే భ్రమలో అసలుకే ఎసరు తెస్తున్నారా? ….ఇలాంటి చర్చ పచ్చ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది.